బంగ్లా ఎంపీ హత్య ఘటనలో పురోగతి

చికిత్స కోసం భారత్‌కు వచ్చి హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అనర్‌ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Published : 24 May 2024 05:15 IST

సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా విచారణ

కోల్‌కతా/ఢాకా: చికిత్స కోసం భారత్‌కు వచ్చి హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అనర్‌ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలో నివసించే ఓ మిత్రుడు అద్దెకు తీసుకున్న టౌన్‌హాల్‌ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లిన ఆయన.. తిరిగి రాలేదు. కానీ, ఆయనతోపాటు లోపలకు వెళ్లిన వారు మాత్రం ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. ఆ సమయంలో వారి చేతుల్లో పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నట్లు సీసీ టీవీల్లో రికార్డయింది. ఇంతకీ ఆ బ్యాగుల్లో ఏముందో మిస్టరీగా మారింది. మే 13 నుంచి కనిపించకుండాపోయిన ఆయన హత్యకు గురైనట్లు బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా.. ఇంతవరకు మృతదేహం దొరకలేదు. పోలీసు బృందాలు, కేంద్ర ప్రభుత్వ బలగాలు, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు ఈ కేసు దర్యాప్తులో భాగమయ్యాయి. ఈ క్రమంలో వారు బుధవారం టౌన్‌హాల్‌ వద్దనున్న అపార్ట్‌మెంట్‌కు చేరుకోగా.. అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. ఫోరెన్సిక్‌ బృందాలు మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఈ కేసులో బంగ్లా పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. బెంగాల్‌ సీఐడీ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. హత్యకు ముందే ప్రణాళిక రచించారనీ, ఇందుకోసం అమెరికాలో ఉండే ఆయన పాత స్నేహితుడు సుమారు రూ.5 కోట్ల సుపారీ ఇచ్చారనీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు