ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ముగ్గురు యువకుల దుర్మరణం

ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్నేహితులు దుర్మరణం చెందిన సంఘటన హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది.

Published : 25 May 2024 05:12 IST

హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై ఘటన

ఆమనగల్లు, న్యూస్‌టుడే: ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్నేహితులు దుర్మరణం చెందిన సంఘటన హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. ఆమనగల్లు సీఐ ప్రమోద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ హస్తినాపూర్‌ ద్వారకానగర్‌కు చెందిన శివకృష్ణగౌడ్‌(28), బైరామల్‌గూడకు చెందిన బుర్ర మణిదీప్‌గౌడ్‌(25), నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్‌తండాకు చెందిన మెగావత్‌ నిఖిల్‌(26) కారులో కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఉదయం 6.40 గంటలకు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం రాంనుంతల శివారుకు చేరుకోగానే హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులూ తీవ్రంగా గాయపడి కారులోనే కన్నుమూశారు. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగంలోకి కారు చొచ్చుకొని వెళ్లింది. పోలీసులు చేరుకుని క్రేన్ల సహాయంతో రెండు వాహనాలను వేరు చేసి, కారులో ఇరుక్కుపోయిన ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

శివకృష్ణగౌడ్, మెగావత్‌ నిఖిల్, మణిదీప్‌గౌడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని