అలుముకున్న నిర్లక్ష్యం.. అగ్నికీలలై

పైపులైన్ల ద్వారా గృహాలకు వంట గ్యాస్‌ సరఫరా చేస్తున్న మేఘా సంస్థ నిర్లక్ష్యం కారణంగా.. జీవనోపాధి కోసం తెలంగాణ నుంచి వచ్చిన ఓ కుటుంబం పెను ప్రమాదానికి గురైంది.

Published : 27 May 2024 05:43 IST

కనెక్షన్లు ఇవ్వకుండానే పైపులైన్‌కు గ్యాస్‌ సరఫరా
కృష్ణా జిల్లాలోని ఓ పరిశ్రమ క్వార్టర్స్‌లో అగ్ని ప్రమాదం
మంటల్లో చిక్కుకొని నలుగురికి తీవ్రంగా కాలిన గాయాలు

మోహన్‌ స్పింటెక్స్‌ పరిశ్రమ ఆవరణలోని పేలుడు సంభవించిన ఇల్లు

హనుమాన్‌ జంక్షన్, న్యూస్‌టుడే: పైపులైన్ల ద్వారా గృహాలకు వంట గ్యాస్‌ సరఫరా చేస్తున్న మేఘా సంస్థ నిర్లక్ష్యం కారణంగా.. జీవనోపాధి కోసం తెలంగాణ నుంచి వచ్చిన ఓ కుటుంబం పెను ప్రమాదానికి గురైంది. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లెలోని మోహన్‌ స్పింటెక్స్‌ పరిశ్రమలో కార్మికుల వసతిగృహ సముదాయానికి గ్యాస్‌ సరఫరా సంస్థ నిర్వాహకులు పైపులైను అమర్చారు. వాటికి డమ్మీలు అమర్చకుండానే గ్యాస్‌ సరఫరా చేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వీరవల్లి ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చెందిన సాయినాథ్‌ (27), లక్ష్మీబాయి (20) దంపతులు రేమల్లెలోని మోహన్‌ స్పింటెక్స్‌లో కార్మికులుగా పని చేసేందుకు వచ్చారు. ఏడాది కిందటే వీరికి వివాహమైంది. మహారాష్ట్రలో ఉంటున్న సాయినాథ్‌ సోదరి అనిత పాండురంగ పండరి (34) తన అయిదేళ్ల కుమారుడు యువరాజ్‌తో కలిసి కొంతకాలం కిందట ఇక్కడకు వచ్చారు. ఆమె కూడా ఇదే పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరంతా పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న నివాస సముదాయం (క్వార్టర్స్‌)లో ఉంటున్నారు. శనివారం అర్ధరాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చారు. పాలు కాచేందుకు పొయ్యి వెలిగించగానే.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న నలుగురూ అగ్నికీలల్లో చిక్కుకున్నారు. చుట్టపక్కల కార్మికులు గమనించి వారిని బయటకు చేర్చేలోపు నలుగురికీ సగానికి పైగా కాలిన గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న సామగ్రి దగ్ధమైంది. క్షతగాత్రులను మొదట నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం వారు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారు. దాదాపు 240 కుటుంబాలు నివసిస్తున్న క్వార్టర్స్‌కు గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చే విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం తగదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లల్లోకి గ్యాస్‌ సరఫరా చేసే పాయింట్ల వద్ద డమ్మీలు అమర్చకపోవడంతోనే వాయువు వెలువడి, ప్రమాదానికి కారణమైందని ఎస్సై చిరంజీవి తెలిపారు. మోహన్‌ స్పింటెక్స్‌ పరిశ్రమ వర్గాల ఫిర్యాదు మేరకు మేఘా కంపెనీ ప్రతినిధులపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

డమ్మీ అమర్చని గ్యాస్‌ పైపులైను వద్ద జరిగిన పేలుడు ఆనవాళ్లు 

ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సాయినాథ్, లక్ష్మి దంపతులు

ఆసుపత్రిలో తీవ్రంగా కాలిన గాయాలతో తల్లి అనిత, కుమారుడు యువరాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని