మోసపోయిన అమెరికన్‌ మహిళ.. రూ.6 కోట్లకు నకిలీ నగల కొనుగోలు

అమెరికాకు చెందిన చెరిష్‌ అనే మహిళ జైపుర్‌లోని ఓ దుకాణ యజమాని నుంచి నకిలీ నగలు కొని రూ.6 కోట్లు నష్టపోయారు. రాజస్థాన్‌ రాజధాని నగరమైన జైపుర్‌లోని మనక్‌ చౌక్‌ పోలీస్‌స్టేషను పరిధిలో ఉన్న జొహ్రీ బజారు దుకాణం నుంచి ఆమె ఈ నగలు కొన్నారు.

Updated : 08 Jun 2024 05:13 IST

ఎంబసీ జోక్యంతో విచారణ
పరారీలో జైపుర్‌ వ్యాపారి

జైపుర్‌: అమెరికాకు చెందిన చెరిష్‌ అనే మహిళ జైపుర్‌లోని ఓ దుకాణ యజమాని నుంచి నకిలీ నగలు కొని రూ.6 కోట్లు నష్టపోయారు. రాజస్థాన్‌ రాజధాని నగరమైన జైపుర్‌లోని మనక్‌ చౌక్‌ పోలీస్‌స్టేషను పరిధిలో ఉన్న జొహ్రీ బజారు దుకాణం నుంచి ఆమె ఈ నగలు కొన్నారు. గత ఏప్రిల్‌ నెలలో ఆ నగలతో అమెరికాలో ప్రదర్శన ఏర్పాటుచేయగా.. అవి అసలు నగలు కావనే విషయం అక్కడ బయటపడింది. నగలతో మళ్లీ జైపుర్‌కు చేరుకున్న చెరిష్‌ దుకాణ యజమాని రాజేంద్ర సోని, అతడి కుమారుడు గౌరవ్‌లను నిలదీశారు. ఆమె మాటలు నిజం కాదని రాజేంద్ర బుకాయించడంతో మే 18న మనక్‌ చౌక్‌ పోలీస్‌స్టేషనులో చెరిష్‌ ఫిర్యాదు చేశారు. నిందితుడైన రాజేంద్ర సోని తిరిగి బాధితురాలిపై తప్పుడు కేసు పెట్టాడు. ఈ విషయాన్ని అమెరికన్‌ రాయబార కార్యాలయం దృష్టికి చెరిష్‌ తీసుకువెళ్లారు. ఎంబసీ జోక్యంతో జైపుర్‌ పోలీసులు విచారణను వేగవంతం చేసి రాజేంద్ర అమ్మిన నగలు నకిలీయే అని తేల్చారు. తండ్రీకొడుకులు ఇద్దరూ పరారీలో ఉన్నారని, ఆ నగలకు ధ్రువపత్రం జారీచేసిన నందకిశోర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజేంద్ర జైపుర్‌లో ఇటీవలే రూ.3 కోట్ల ఫ్లాటు కొన్నట్లు తెలిసిందన్నారు. నిందితులు వెండి నగలకు బంగారుపూత పూసి అమెరికన్‌ మహిళను మోసం చేశారని, వారి కోసం గాలింపునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు అదనపు డీసీపీ బజరంగ్‌ సింగ్‌ షెకావత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని