రూ.1,770 కోట్లు కొల్లగొట్టారు

దేశంలో సైబర్‌ నేరాలకు సంబంధించి రోజుకు సగటున 6 వేలకు పైగా ఫిర్యాదులందుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు 7.4 లక్షల కేసులు నమోదయ్యాయి.

Published : 10 Jun 2024 03:29 IST

4 నెలల్లో సైబర్‌ నేరగాళ్లు దోచుకున్న సొమ్ము
సైబర్‌ నేరాలపై ఐ4సీ గణాంకాల్లో విస్తుపోయే నిజాలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో సైబర్‌ నేరాలకు సంబంధించి రోజుకు సగటున 6 వేలకు పైగా ఫిర్యాదులందుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు 7.4 లక్షల కేసులు నమోదయ్యాయి. వీటిలో నకిలీ ట్రేడింగ్, డిజిటల్‌ మోసాలు వంటి ప్రధాన కేసుల్లోనే బాధితులు పోగొట్టుకున్న మొత్తం దాదాపు రూ.1,770 కోట్లు. దేశంలో సైబర్‌ నేరాల తీవ్రతకు అద్దం పడుతున్న గణాంకాలివి. సామాన్యుడి నుంచి ఉన్నతాధికారుల దాకా వీటిబారిన పడుతున్నారు. గ్రామాల నుంచి మెట్రో నగరాల వరకు సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ‘ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌’ పేరిట హైదరాబాద్‌లోని ఓ విశ్రాంత ఐఏఎస్‌ రూ.1.87 కోట్లు కోల్పోతే.. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ఓ వ్యాపారి రూ.7 కోట్లు మోసపోవడం తాజా ఉదంతాలు. దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న సైబర్‌ నేరాలపై నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పీ)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విరుగుడు చర్యలపై ఇండియన్‌ సైబర్‌క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) దృష్టి సారించింది. ఈ మేరకు గణాంకాలను వెల్లడిస్తూ.. ఎక్కువగా ఏ తరహా మోసాలు జరుగుతున్నాయో గుర్తించింది.

నకిలీ ట్రేడింగ్‌: షేర్లలో పెట్టుబడుల ద్వారా లాభాలు గడించేందుకు మెలకువలు నేర్పిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు వాట్సప్‌ గ్రూపుల్లో చేర్పిస్తున్నారు. తొలుత కొంతమేర లాభాలు ఇప్పించి ఆకర్షిస్తున్నారు. వర్చువల్‌ ఖాతాల్లో పెద్దమొత్తంలో సొమ్ము జమ అవుతున్నట్లు చూపిస్తున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టాక వర్చువల్‌ ఖాతాల్లో కనిపిస్తున్న లాభాల్ని విత్‌డ్రా చేసుకుందామంటే స్పందించడం మానేస్తున్నారు. ఒత్తిడి చేస్తే గ్రూప్‌లో నుంచి తొలగిస్తున్నారు.

లోన్‌ యాప్‌లు: ఆన్‌లైన్‌లోనే సులభంగా రుణాలిస్తామంటూ నేరగాళ్లు ఆశ పెడుతున్నారు. ఈ క్రమంలో బాధితుల సెల్‌ఫోన్‌లో కాంటాక్టు నంబర్లు, ఫొటోలు, వీడియోలు వీక్షించేలా అనుమతులు పొందుతున్నారు. రుణం మంజూరు చేసిన తర్వాత భారీమొత్తంలో వడ్డీలు విధిస్తున్నారు. కట్టకపోతే బాధితుల ఫోన్లలోని ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతుండటంతోపాటు కాంటాక్టు నంబర్లకు ఫోన్లు చేసి దొంగగా చిత్రీకరిస్తూ అవమానాల పాల్జేస్తున్నారు. వీరి వేధింపులకు దేశవ్యాప్తంగా 100 మంది వరకు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులందాయి.

డేటింగ్‌ యాప్‌లు: డేటింగ్‌ యాప్‌లలో అందమైన యువతుల ఫొటోలు, ఫోన్‌ నంబర్లను ఉంచుతున్నారు. ఎవరైనా కాల్‌చేస్తే తీయని మాటలతో ఆకర్షిస్తున్నారు. డేటింగ్‌ పేరిట కొద్దిరోజులు మాట్లాడి భావోద్వేగాలతో కూడిన ప్రేమ నటిస్తున్నారు. అనంతరం అత్యవసర చికిత్సల పేరిట డబ్బు లాగుతున్నారు. ఇటీవలి కాలంలో పబ్‌లకు, క్లబ్‌లకు తీసుకెళ్లి రూ.వేలల్లో బిల్లులు కట్టిస్తున్న ఉదంతాలు నగరాల్లో పెరుగుతున్నాయి.

గేమింగ్‌ యాప్‌లు: సైబర్‌ నేరగాళ్ల ముఠాలు సెల్‌ఫోన్లలో గేమ్‌లకు అనుమతులిచ్చే ముసుగులో బ్యాంకింగ్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ లాంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఖాతాల్లోనుంచి డబ్బు కొట్టేస్తున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌లలో పెట్టుబడులు పెట్టించి డబ్బులను కాజేస్తున్నారు.

నకిలీ ఖాతాలతో..: ప్రముఖుల పేర్లతో కూడిన నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలను రూపొందించి డబ్బులు కొట్టేసే మోసమిది. ప్రముఖుల ఫొటోలను ఆన్‌లైన్‌లో సేకరించి వాటితోనే సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను తెరుస్తున్నారు. ఆయా ప్రముఖుల పరిచయస్థులకు మెసేజ్‌లు పంపించి అత్యవసరంగా డబ్బు అవసరముందని నమ్మించి లూటీ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు