విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుత్తు సరఫరా లేదని భావించి ఫ్యూజ్‌ వేసేందుకు స్తంభం ఎక్కిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

Published : 28 Nov 2022 05:41 IST

ఫ్యూజ్‌ వేసేందుకు స్తంభం ఎక్కి ప్రాణాలు కోల్పోయిన వైనం

గోపాలపురం, న్యూస్‌టుడే: విద్యుత్తు సరఫరా లేదని భావించి ఫ్యూజ్‌ వేసేందుకు స్తంభం ఎక్కిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపాలపురం- కోమటికుంట గ్రామాల మధ్య ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గోపాలపురానికి చెందిన కురుకూరి సోమరాజు (50) అవివాహితుడు. వ్యవసాయం చేస్తూ వృద్ధురాలైన తల్లిని, తమ్ముడిని పోషిస్తున్నారు.ఆదివారం పొలంలో పనులు ముగించుకున్నాక విద్యుత్తు లేదని భావించి ఫ్యూజు వేసేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సోమరాజు మరణం ప్రభుత్వ హత్యేనని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకట్రాజు ఆరోపించారు. రైతు మృతదేహం వద్ద తెదేపా శ్రేణులు, రైతులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల ఏర్పాటుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అందులో భాగంగానే తీగలు తొలగించడంతో మూడు రోజులుగా సరఫరా లేక తన పంటకు నీరు అందించలేక ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడని తెదేపా నాయకులు, రైతులు ఆరోపిస్తున్నారు. విద్యుత్తుశాఖ ఏడీఈ రవిశంకర్‌ను వివరణ కోరగా.. విద్యుత్తు మోటార్లకు మీటర్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టడం లేదని తెలిపారు. వ్యక్తిగత వివరాలు ఇవ్వకపోతే నోటీసులే ఇస్తున్నామని, సోమరాజు తమకు సమాచారం ఇవ్వకుండా స్తంభం ఎక్కి, ఫ్యూజ్‌ వేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని