GHMC: పారిశుద్ధ్య ఉద్యోగి కీచకపర్వం

జీహెచ్‌ఎంసీ గాజులరామారం సర్కిల్‌ పరిధిలో ఓ శానిటేషన్‌ ఫీల్ట్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఎఫ్‌ఏ) కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 24 May 2024 05:57 IST

మహిళా కార్మికులను లొంగదీసుకుని అసభ్యకర ప్రవర్తన
వారితో సెల్‌ఫోన్‌లో వీడియోల చిత్రీకరణ
ఎస్‌ఎఫ్‌ఏను డిస్మిస్‌ చేసిన ఉన్నతాధికారులు

కిషన్‌

షాపూర్‌నగర్, న్యూస్‌టుడే: జీహెచ్‌ఎంసీ గాజులరామారం సర్కిల్‌ పరిధిలో ఓ శానిటేషన్‌ ఫీల్ట్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఎఫ్‌ఏ) కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రబుద్ధుడు మహిళా పారిశుద్ధ్య కార్మికులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ బాగోతాన్ని తన సెల్‌ఫోన్‌లోనే చిత్రీకరించాడు. తర్వాత వాటిని చూపించి.. వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నాడు. కార్మికులు తెలిపిన సమాచారం ప్రకారం.. మూణ్నెల్ల కిందట ఈ ఎస్‌ఎఫ్‌ఏ కిషన్‌ బాగోతంపై అధికారులకు తెలియడంతో.. అతన్ని సూరారం ప్రాంతానికి బదిలీ చేశారు. మహిళా కార్మికులు తనతో సఖ్యతగా ఉంటూ.. పనులు చేయకున్నా హాజరువేయడం, తనకు తలొగ్గకపోతే పనులకు వచ్చినా గైర్హాజరు చూపుతూ బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబితే తన పలుకుబడితో ఉద్యోగాల నుంచి తీసేయిస్తానని భయపెడుతూ కీచకపర్వాన్ని కొనసాగిస్తున్నాడు. 

కార్మికుడికి ఫోన్‌ ఇవ్వడంతో వెలుగులోకి.. 

ఎస్‌ఎఫ్‌ఏ కిషన్‌ మూడు నెలల కిందట బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్తూ అధికారిక సెల్‌ఫోన్‌ను ఓ కార్మికుడికి అప్పగించి వెళ్లాడు. దీంతో ఈ వీడియోలు బయటపడ్డాయి. మహిళా కార్మికులతో ఈ కామాంధుడి లీలలకు సంబంధించిన 69 వీడియోలు అందులో ఉన్నాయి. సదరు కార్మికుడు వాటిని ఇతర సిబ్బందికి, ఉన్నతాధికారులకు పంపాడు. ఈక్రమంలో కిషన్‌ మరోసారి ఇలాంటి తప్పులు చేయనని అధికారులను బతిమాలుకోగా వారు వదిలేశారు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో వారం కిందట ఉన్నతాధికారులు అతన్ని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటనను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ తీవ్రంగా పరిగణించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ అభిలాష అభినవ్, గాజులరామారం ఉపకమిషనర్‌ మల్లారెడ్డి, వైద్యాధికారి భాస్కర్‌రెడ్డిలను ఆదేశించారు. వారు విచారించి ఇచ్చిన నివేదికతో.. కిషన్‌తో పాటు ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసిన పారిశుద్ధ్య కార్మికుడు సీహెచ్‌ ప్రణయ్‌ను గురువారం సర్వీసు నుంచి డిస్మిస్‌ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని