Gurugram: ‘నేనేం తప్పు చేశాను.. నాకెందుకు ఈ శిక్ష’... 14 ఏళ్ల బాలికపై దంపతుల పైశాచిక దాడి!

పని సరిగా చేయడంలేదని 14 ఏళ్ల బాలికను గుర్‌గ్రామ్‌కు చెందిన దంపతులు తీవ్రంగా హిసించారు. బాలిక పరిస్థితి గురించి తెలుసుకున్న సామాజిక కార్యకర్త పోలీసుల సహాయంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.

Updated : 08 Feb 2023 19:57 IST

గురుగ్రామ్‌: పేదరికం ఆ బాలికను పాఠశాలకు బదులు పనికి వెళ్లేలా చేసింది. ఆటపాటలతో సరదాగా సాగాల్సిన ఆ బాలిక జీవితం మరో చిన్నారి బాగోగులు చూసే ఆయాగా మార్చింది. అయితే, అదే పని ఆమెకు నిత్యం నరకం చూపించింది. పల్లె నుంచి పట్టణానికి వచ్చిన ఆ బాలికకు పని ప్రదేశంలో వేధింపులే ఎదురయ్యాయి. తనను ఎందుకు హింసిస్తున్నారో తెలియని ఆ బాలిక తిండి కోసం ఇంట్లో చెత్త డబ్బాను ఆశ్రయించాల్సిన దుస్థితికి చేరింది. ఈ విషయం గురించి తెలిసిన సామాజిక కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నరకకూపం నుంచి బయటపడింది. ఇంతటి దారుణమైన ఘటన హరియాణా (Haryana)లోని గురుగ్రామ్‌(Gurugram)లో చోటుచేసుకుంది. 

గురుగ్రామ్‌కు చెందిన మనీష్‌ కట్టర్‌, కమల్‌జీత్‌ కౌర్‌ దంపతులకు మూడున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ చిన్నారి బాగోగులు చూసుకునేందుకు ఐదు నెలల క్రితం ఝార్ఖండ్‌(Jharkhand)లోని రాంచీ (Ranchi) నుంచి 14 ఏళ్ల బాలికను ఓ ఏజెన్సీ ద్వారా ఇంటి సహాయకురాలి (Domestic Helper)గా నియమించుకున్నారు. పనిలో చేరిన కొద్ది రోజుల తర్వాత బాలిక సరిగా పనిచేయడంలేదని ఆమెను ముఖంపై కొడుతూ, చేతులపై వాతలు పెడుతూ, కత్తితో చేతులపై కోస్తూ వేధించసాగారు. భోజనం కూడా పెట్టక పోవడంతో, ఇంట్లో ఉండే చెత్త డబ్బాలో పడేసిన ఆహారాన్ని తినేదాన్నని బాలిక విచారణలో వెల్లడించింది. కౌర్‌ దంపతుల చేతిలో బాలిక నరకం అనుభవిస్తున్న  విషయాన్ని తెలుసుకున్న దీపికా నారాయణ్‌ భరద్వాజ్‌ అనే సామాజిక కార్యకర్త  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఆమె ఫిర్యాదు మేరకు కౌర్‌ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేసి, బాలికను ఎన్జీవోకు అప్పగించారు. ప్రస్తుతం బాలికకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు దీపికా తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని