Hyderabad: అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి అదృశ్యం.. కుటుంబానికి బెదిరింపు కాల్‌..!

తెలంగాణ విద్యార్థి ఒకరు రెండు వారాల క్రితం అమెరికాలో అదృశ్యమయ్యాడు. సొమ్ము చెల్లించాలని అతడి కుటుంబానికి బెదిరింపు కాల్‌ వచ్చింది. 

Published : 20 Mar 2024 14:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ మహమ్మద్‌ అనే విద్యార్థి మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్లేవ్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నాడు. తమకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చిందని అబ్దుల్‌ తండ్రి మహమ్మద్‌ సలీం పేర్కొన్నారు. వారు 1,200 డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారని.. లేనిపక్షంలో తమ కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. తాము అంగీకరించి.. అబ్దుల్‌ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపమని అడిగామన్నారు. దీనికి కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసి ఫోన్‌ పెట్టేశారని.. మళ్లీ కాల్‌ చేయలేదని తెలిపారు. కాకపోతే.. కిడ్నాపర్‌ మాట్లాడటానికి ముందు ఫోన్‌లో ఏడుపు వినిపించిందని చెప్పారు. ఈ నెంబర్‌ను అమెరికాలోని తమ బంధువులకు పంపి.. క్లేవ్‌ల్యాండ్‌ పోలీసులకు అందజేయాలని చెప్పినట్లు తెలిపారు. 

అంతర్జాతీయ డ్రగ్‌ డీలర్‌ ఓక్రా అరెస్ట్‌

అబ్దుల్‌ అదృశ్యమైన విషయంపై అతడి బంధువులు మార్చి 8వ తేదీనే క్లేవ్‌ల్యాండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఒక లుకౌట్‌ నోటీసు జారీ చేశారు. మరోవైపు అతడి కుటుంబసభ్యులు 18వ తేదీన చికాగోలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించి.. తమ కుమారుడి ఆచూకీ కనుగొనడంలో సాయం చేయాలని కోరారు. ప్రస్తుతం అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక అతడి తల్లి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తన కుమారుడితో చివరిసారిగా మార్చి 7వ తేదీన మాట్లాడినట్లు వెల్లడించారు. 

ఈ ఏడాది అమెరికాలోని చికాగోలో హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి సయ్యద్‌ మజాహిర్‌ అలీపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ విద్యార్థి ఇండియానా వెస్లయన్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. అక్కడి భారత దౌత్య కార్యాలయం అతడికి అవసరమైన సాయం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని