అంతర్జాతీయ డ్రగ్‌ డీలర్‌ ఓక్రా అరెస్ట్‌

పంజాగుట్ట డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన అంతర్జాతీయ స్మగ్లర్‌, గోవాలో కొల్వాలే జైలులో విచారణ ఖైదీగా ఉన్న ఓక్రాను పంజాగుట్ట పోలీసులు పీటీ వారెంటుపై మంగళవారం నగరానికి తీసుకొచ్చారు.

Updated : 20 Mar 2024 05:22 IST

గోవా జైలు నుంచి పీటీ వారెంటుపై నగరానికి తరలింపు
ఈనాడు - హైదరాబాద్‌

పంజాగుట్ట డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన అంతర్జాతీయ స్మగ్లర్‌, గోవాలో కొల్వాలే జైలులో విచారణ ఖైదీగా ఉన్న ఓక్రాను పంజాగుట్ట పోలీసులు పీటీ వారెంటుపై మంగళవారం నగరానికి తీసుకొచ్చారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఓక్రాను వివిధ అంశాలపై ప్రశ్నించేందుకు 7 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటివరకూ ఈ కేసులో స్టాన్లీ, నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన డ్రగ్స్‌ను పుణెలో అందుకుని దేశవ్యాప్తంగా సరఫరా చేసే సౌరభ్‌, హైదరాబాద్‌లో డ్రగ్స్‌ విక్రయించే విశాల్‌, ఇతడికి గోవాలో సహకరించే దివాకర్‌ అలియాస్‌ బాబా అరెస్టయ్యారు. ఓక్రా అరెస్టుతో ఈ సంఖ్య 5కు చేరింది.

డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ కింగ్‌పిన్‌..

నైజీరియాకు చెందిన ఆంటోనియో ఒబింటా అలియాస్‌ ఓక్రా.. కొన్నేళ్ల క్రితం వ్యాపారం పేరిట భారత్‌కు వచ్చాడు. గోవా కేంద్రంగా.. నిషేధిత డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ మొదలుపెట్టాడు. మూడేళ్ల క్రితం నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులకు చిక్కి అక్కడి కొల్వాలే జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. జైల్లో ఉన్నా డ్రగ్స్‌ దందా ఆపలేదు. సిబ్బంది సాయంతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తూ జైలు నుంచే నెదర్లాండ్స్‌లోని డీలర్ల ద్వారా సరకు తెప్పించి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. ప్రధాన నిందితుడు స్టాన్లీ తనకు డ్రగ్స్‌ అవసరమైనప్పుడల్లా ఓక్రాకు ఫోన్‌ చేసేవాడు. ఓక్రా ఆదేశాలతో నెదర్లాండ్స్‌ నుంచి వస్త్రాలు, వివిధ వస్తువుల మాటున కార్గో విమానాల్లో పుణెకు సరఫరా అయ్యే డ్రగ్స్‌ను.. సౌరభ్‌ తీసుకుని అనుచరుల ద్వారా స్టాన్లీకి పంపించేవాడు. స్టాన్లీ.. తన అనుచరులైన ఇద్దరు ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా సరఫరా చేసేవాడు. వీరిలో ఒకడు కొల్వాలే జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. మరొకడు ఇప్పటికీ చిక్కలేదు. ఇతడిని పట్టుకోవడంపై పోలీసులు దృష్టిపెట్టారు.

టీఎస్‌ న్యాబ్‌, పంజాగుట్ట పోలీసులు తొలుత స్టాన్లీని అరెస్టు చేసినప్పుడు అతడి నుంచి రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. స్టాన్లీ దగ్గరే ఈ స్థాయిలో దొరికితే.. దేశంలోకి ఓక్రా తెప్పించే డ్రగ్స్‌ విలువ ఇంకా భారీగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని