Crime news: మహిళా లెక్చరర్‌గా నమ్మించి.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం!

మహిళా లెక్చరర్‌గా నమ్మించి.. స్కాలర్‌షిప్‌ పని పేరిట విద్యార్థినులను పిలిపించి, వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం వెలుగుచూసింది.

Published : 26 May 2024 00:06 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ఓ దిగ్భ్రాంతికర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫోన్‌లో మహిళా లెక్చరర్‌గా నమ్మించి.. స్కాలర్‌షిప్‌ పని పేరిట విద్యార్థినులను పిలిపించి, వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. వేర్వేరు ఘటనల్లో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థినులపై ఇలా దారుణానికి ఒడిగట్టినట్లు తెలియరాగా.. వారి సంఖ్య ఎక్కువే ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల్లో చాలామంది గిరిజనులే ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 16 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

యాప్‌ సాయంతో గొంతు మార్చి..

పోలీసుల వివరాల ప్రకారం.. సీధీ జిల్లాకు చెందిన బ్రజేశ్‌ ప్రజాపతి (30).. యాప్‌ సాయంతో ఓ కళాశాల మహిళా లెక్చరర్‌గా గొంతు మార్చి, స్కాలర్‌షిప్‌ పని ఉందంటూ విద్యార్థినులకు ఫోన్‌ చేసేవాడు. ‘నా కుమారుడు మిమ్మల్ని మా ఇంటికి తీసుకువస్తాడు’ అని ఆ లెక్చరర్‌ చెప్పినట్లు మాట్లాడేవాడు. అది నిజమని నమ్మి వచ్చిన బాలికలను తన బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం వారి వద్ద నుంచి ఫోన్‌ లాక్కొని పరారయ్యేవాడు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు మే 16న తొలి కేసు, అనంతరం మరో మూడు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి నంబర్లు సేకరించి..

దర్యాప్తులో భాగంగా నిందితుడి చేతిపై కాలిన గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే చివరకు అతడిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఏడుగురిపై అత్యాచారానికి పాల్పడినట్లు అతడు అంగీకరించాడని తెలిపారు. బాధితుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చని, ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. లవ్‌కుశ్‌ ప్రజాపతి, రాహుల్‌ ప్రజాపతి, సందీప్‌ ప్రజాపతిలనూ అరెస్టు చేశామన్నారు. వీరిలో ఒకరు కళాశాల విద్యార్థి అని, కాలేజీ వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి విద్యార్థినుల ఫోన్‌ నంబర్లు సేకరించినట్లు తెలిపారు. అయితే.. ఆయా ఘటనల్లో వీరి పాత్రపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.

ఇదేం రైలురా బాబోయ్‌.. ఏసీ కంపార్ట్‌మెంటా? చేపల మార్కెట్టా?

ఈ ఘటనను మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దారుణాలకు పాల్పడేవారు సమాజానికి శత్రువులని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు తొమ్మిది మంది సభ్యులతో కూడిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)’ ఏర్పాటు చేశారు. ఈ కేసుపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. గిరిజనులు, మహిళలపై జరుగుతున్న నేరాల్లో మధ్యప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని విమర్శించారు. బాధితులకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని