Brahmaputra Express: ఇదేం రైలురా బాబోయ్‌.. ఏసీ కంపార్ట్‌మెంటా? చేపల మార్కెట్టా?

పట్నా మీదుగా ప్రయాణిస్తున్న బ్రహ్మపుత్ర రైలులో థర్డ్‌ ఏసీ కంపార్ట్‌మెంట్‌ సాధారణ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Published : 25 May 2024 17:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కొందరు రైలు ప్రయాణికులు (Train passengers) జనరల్‌ బోగీల్లోకి వెళ్లలేక.. రిజర్వేషన్‌ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిపోతుంటారు. ఎంతో కొంత ఫైన్‌ కట్టి గమ్యం చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు టీసీలు కూడా చూసీచూడనట్లు వదిలేస్తారు. ఏసీ కంపార్ట్‌మెంట్‌లో మాత్రం కచ్చితంగా నిబంధనలు పాటిస్తారు. రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ కాని వారిని, టికెట్‌ లేనివారిని ఆర్‌పీఎఫ్‌ (RPF) సిబ్బంది బయటకు పంపేస్తారు. కానీ, బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్‌లో (Brahmaputra Express) ఓ కుటుంబానికి ఎదురైన అనుభవం సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఏసీ కంపార్ట్‌మెంట్‌, జనరల్‌ బోగీ కంటే దారుణంగా నిండిపోయింది. రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ కానివారు, అసలు టికెట్‌ తీసుకోనివారు కూడా అందులోకి వచ్చేయడంతో థర్డ్‌ ఏసీ బోగీ కాస్తా చేపల మార్కెట్‌లా తయారైంది.

విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్‌కి థర్డ్‌ ఏసీ కంపార్ట్‌మెంట్‌లో 8 టికెట్లు బుక్‌ చేశారు. పట్నా స్టేషన్‌లో రైలు ఎక్కగానే ఆయన కుటుంబానికి విచిత్ర అనుభవం ఎదురైంది. అప్పటికే సీట్లన్నీ నిండిపోయి. జనం కిక్కిరిసి ఉన్నారు. తమకు రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ అయ్యిందని చెప్పినా ఎవరూ వినిపించుకునే పరిస్థితిలో లేరు. సాయం కోరేందుకు ఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో లేరు. చివరికి ఏదోలా ప్రయత్నించి విజయ్‌ ఆరు సీట్లు దక్కించుకున్నారు. అక్కడి పరిస్థితిని వీడియో తీసి ఎక్స్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. ఒక్క బ్రహ్మపుత్రలోనే కాదు చాలా రైళ్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రద్దీగా ఉండే మార్గాల్లో ప్రయాణికుల భద్రత, వారికి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యతపై ఈ వీడియో పలు ప్రశ్నలు అడుగుతోంది. రిజర్వేషన్‌ బోగీల్లోకి సాధారణ ప్రయాణికులు రాకుండా చూడాల్సిన బాధ్యత రైల్వే అధికారులపై ఉన్నప్పటికీ విస్మరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని