Scam Alert: భారీ రాబడులంటూ కోటికి పైగా కొట్టేశారు.. వెలుగులోకి ఫేక్‌ స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌!

Scam Alert: స్టాక్‌ మార్కెట్ పెట్టుబడుల్లో పెద్ద మొత్తంలో స్థిరమైన ఆదాయం అంటూ మోసగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడిన ఉదంతం ఇదీ.. 

Published : 27 Mar 2024 00:11 IST

Scam Alert | ఇంటర్నెట్‌డెస్క్‌: పెట్టుబడులపై అత్యధిక రాబడి కోసం అందరూ చూస్తుంటారు. అందుకోసం వివిధ పెట్టుబడి సాధనాలను పరిశీలిస్తారు. ఇటీవల కాలంలో స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెరిగాయి. మార్కెట్‌ గురించి తెలీని వారు సైతం ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. భారీ ఆదాయం వస్తుందంటూ ఓ వ్యక్తికి ఎరవేశారు. ఫేక్‌ స్టాక్‌ మార్కెట్‌ను సృష్టించి రూ.కోటిన్నర కొట్టేశారు.

అమిత్‌ కిషోర్‌(42) అనే వ్యక్తి లుథియానాలోని పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అత్యధిక లాభాలు ఆర్జించొచ్చని ఆయన్ని కొందరు వ్యక్తులు నమ్మించారు. మాయమాటలు చెప్పి తొమ్మిది మంది ఉన్న ఓ వాట్సప్‌ గ్రూప్‌లో అతడిని యాడ్‌ చేశారు. పెట్టుబడి సలహాల పేరుతో డబ్బులు పెట్టించారు.  పెట్టుబడిపై భారీ ప్రతిఫలం కూడా కనిపించడం మొదలైంది. ఆ సొమ్ము విత్‌ డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే అసలు రంగు బయటపడింది. అవన్నీ కేవలం ఫేక్‌ విజువల్స్‌ అని! అతడి ట్రేడింగ్‌ వాలెట్‌ను స్కామర్లు నిలుపుదల చేశారు. 

డబ్బు కోసం బాలుడి కిడ్నాప్‌.. చంపేసి గోనె సంచిలో కుక్కిన వైనం

భారీగా పెట్టుబడులు పెట్టించడమే కాకుండా.. అమిత్‌ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మరో పన్నాగానికి తెరలేపారు. పెట్టుబడి పెట్టకపోతే భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని బెదిరించారు. బాధితుడిపై ఒత్తిడి తెచ్చేందుకు పెద్ద మొత్తంలో జరిమానాలంటూ ఫేక్‌ లీగల్‌ నోటీసులూ పంపారు.  అలా ఏకంగా రూ.1.4 కోట్లు అతడి చేత ఇన్వెస్ట్‌ చేయించారు. చివరికి తాను మోసపోయాననే విషయం తెలుసుకున్న కిషోర్‌.. లుథియానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దిల్లీ, పశ్చిమ బెంగాల్‌,  మహారాష్ట్రకు చెందిన 9 మందిని గుర్తించారు. వీరిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆకర్షణీయమైన రాబడులు ఎవరైనా పెట్టుబడులు గురించి చెబుతూ ఉంటే వాటి గురించి ఆరా తీయాలని, పూర్తిగా పరిశీలించాకే ముందడుగు వేయాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని