Madhya Pradesh: స్వరం మార్చే యాప్‌తో మభ్యపెట్టి.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం

ఉపకార వేతనాల పేరుతో పేద విద్యార్థినులను మభ్యపెట్టి ఏడుగురు యువతులపై అత్యాచారానికి పాల్పడిన బ్రజేశ్‌ ప్రజాపతి (30) అనే ప్రధాన నిందితుడితోపాటు అతడి సహాయకులైన మరో ముగ్గురిని మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 26 May 2024 05:26 IST

మధ్యప్రదేశ్‌లో నిందితులను అరెస్టు చేసిన ‘సిట్‌’

సీధీ (మధ్యప్రదేశ్‌): ఉపకార వేతనాల పేరుతో పేద విద్యార్థినులను మభ్యపెట్టి ఏడుగురు యువతులపై అత్యాచారానికి పాల్పడిన బ్రజేశ్‌ ప్రజాపతి (30) అనే ప్రధాన నిందితుడితోపాటు అతడి సహాయకులైన మరో ముగ్గురిని మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీధీ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. బాధితుల్లో ఎక్కువమంది గిరిజన తెగలకు చెందినవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఆదేశాలతో ఏర్పడిన ‘సిట్‌’ ఈ కేసును దర్యాప్తు చేసింది. సెల్‌ఫోన్లలో అమర్చుకునే స్వరం మార్పు యాప్‌ సాయంతో ప్రజాపతి యువతులకు ఫోను చేసేవాడు. టికరీ కళాశాల మహిళా టీచరుగా పరిచయం చేసుకొని, తనను కలిస్తే ఉపకార వేతనం ఇప్పించే ఏర్పాటు చేస్తానని నమ్మబలికేవాడు. ‘‘నా కుమారుడు వచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాడు’’ అని మహిళ స్వరంతో చెప్పే ప్రజాపతి.. ఆ తర్వాత చేతికి తొడుగులు, తలకు హెల్మెట్‌ ధరించి తనే ద్విచక్ర వాహనంతో వెళ్లేవాడు. నమ్మి వచ్చిన యువతులను నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకువెళ్లి అత్యాచారం చేసేవాడు.

ఆ తర్వాత బాధితుల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకునేవాడు. బాధితుల్లో నలుగురు యువతులు ముందుకువచ్చి ఫిర్యాదు చేయడంతో చేతులపై కాలిన గాయాల గుర్తులున్న ప్రధాన నిందితుణ్ని, అతడి  సహాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు విద్యార్థినులను ఇలా మోసగించినట్లు ప్రజపతి విచారణలో వెల్లడించాడు. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజాపతికి సహకరించిన మరో ముగ్గురు నిందితుల్లో ఒకరు కళాశాల విద్యార్థి అని, వాట్సప్‌ గ్రూపు నుంచి యువతుల ఫోన్‌ నంబర్లు సేకరించి ఇచ్చేవాడని రేవా రేంజి ఐజీ మహేంద్రసింగ్‌ సికర్వార్‌ శనివారం వివరాలు వెల్లడించారు. ఈ ముగ్గురి పాత్రపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు బ్రజేశ్‌ ప్రజాపతి అరెస్టు అనంతరం.. అనధికారికంగా కట్టిన అతడి ఇంటిని అధికారులు కూల్చివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని