Crime news : హెల్మెట్‌లు ధరించి ఏటీఎం వద్ద తచ్చాడుతూ.. గార్డును చంపి..

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఓ ముఠా హెల్మెట్‌లు ధరించి వచ్చి ఏటీఏంలో (ATM) నగదు నింపే వ్యాన్‌ను చోరీ చేసింది. ఈ క్రమంలో దుండగులు ఓ గార్డును కాల్చి చంపారు. 

Updated : 12 Sep 2023 16:35 IST

Image : Pt_shekhardixit

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం (Uttar Pradesh) మీర్జాపుర్‌లో దోపిడీ దొంగలు పట్టపగలే బీభత్సం సృష్టించారు. ఓ ఏటీఎం (ATM) ముందు తచ్చాడుతూ తిరిగి.. అందులో డబ్బులు నింపడానికి వచ్చిన వ్యాన్‌ను లూటీ చేశారు. ఈ క్రమంలో ఓ గార్డును కాల్చి చంపి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కత్రా కొత్వాలి ప్రాంతంలోని బెల్టార్‌లో యాక్సిస్‌ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉంది. ఏటీఎంలో డబ్బులు నింపేందుకు మంగళవారం ఇద్దరు క్యాషియర్లు, ఓ గార్డు వ్యాన్‌లో వచ్చారు. వారు దిగి డబ్బులు ఏటీఎంలో నింపే పనిలో నిమగ్నం అవుతుండగా.. తొలుత హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి అక్కడ తచ్చాడుతూ కనిపించాడు. 

బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ చేతివాటం.. రూ.8.65 కోట్ల బురిడీ

బ్యాంకు ఉద్యోగులు వ్యాన్‌ తలుపు తెరవగానే హెల్మెట్‌ ధరించి వచ్చిన మరో దుండగుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెంటనే గార్డును తుపాకీతో కాల్చాడు. దాంతో గార్డు కిందపడిపోయాడు. లేవడానికి ప్రయత్నించి స్పృహ తప్పి మళ్లీ పడిపోయాడు. ఇంతలో తెల్ల చొక్కా ధరించి వచ్చిన మరో దుండగుడు వ్యాన్‌ డోరు వద్దకు వెళ్లి రూ.39 లక్షల నగదుతో ఉన్న పెట్టెను తీసుకొని పరాయ్యాడు. ఈ లోగా ఓ బ్యాంకు ఉద్యోగి అప్రమత్తమై పారిపోగా.. మరో ఉద్యోగి తన బ్యాగు తీసుకొని వ్యాన్‌లో కూర్చున్నాడు. రోడ్డు పక్కనే ఆగి ఉన్న మరో దుండగుడు అతడితో పెనుగులాడి ఆ బ్యాగు లాక్కొని పారిపోయాడు. మొత్తం నలుగురు వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిసింది. ముఖాలు కన్పించకుండా జాగ్రత్త పడిన ఆ ముఠా బైక్‌లపై పరారైనట్లు సమాచారం. 

తీవ్రంగా గాయపడిన గార్డును ఓ ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించగా.. అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ సమాచారం తెలిసి డీఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ చోరీలో ఎంత నగదు పోయిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఎస్పీ తెలిపారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని