Pune car Crash: ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?

Pune car Crash: బాలుడి డ్రైవింగ్‌తో ఇద్దరు మృతి చెందిన ఘటన రోడ్డు ప్రమాదం కాదని, హత్య అని బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. 

Updated : 21 May 2024 12:41 IST

దిల్లీ: ఒక మైనర్ దురుసు డ్రైవింగ్ రెండు కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పుణెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన అనీశ్‌, అశ్విని మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలను చూసి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.ఇది ప్రమాదం కాదని హత్య అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటన జరిగిన 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

‘‘ఇప్పుడు మా కుటుంబం అంతా షాక్‌లో ఉంది. ఘటన జరిగిన 15 గంటల్లో బెయిల్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బెయిల్ షరతులు తీవ్రంగా బాధించాయి. మేం న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం. అతడి తల్లిదండ్రులను విచారించాలి. వెంటనే నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకా జీవితమే చూడని అమాయకురాలిని పొట్టనపెట్టుకున్నాడు’’ అని అశ్విని బంధువు ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లో అనీశ్‌ నిర్జీవంగా కనిపించడంతో.. అతడి కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.‘‘ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సమయంలో నిందితుడికి బెయిల్ ఇవ్వడం దారుణం. అతడికి కఠిన శిక్ష పడాలి’’ అని అనీశ్‌ తాతయ్య వాపోయారు.

ఆమెను నమ్మి.. వందల కోట్లు మోసపోయారు!

పుణెలో ఆదివారం తెల్లవారుజామున ఓ బైక్‌ను లగ్జరీ కారు ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  కారు డ్రైవ్‌ చేసిన నిందితుడు ఓ మైనర్‌ అని గుర్తించిన పోలీసులు.. అతడిని కోర్టు ముందు హాజరుపర్చారు. ఆ బాలుడికి జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 300 పదాల్లో ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పనిచేయాలంటూ విధించిన బెయిల్ షరతులు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. నిందితుడిని మేజర్‌గా పరిగణించాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో.. పోలీసులు సెషన్‌ కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు.

మైనర్ తండ్రి అరెస్టు.. 

మహారాష్ట్రలో ఔరంగాబాద్‌లో మైనర్ తండ్రిని పుణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వయసు నిబంధనను మరిచి నిందితుడికి ఆల్కహాల్ సరఫరా చేసిన రెండు బార్స్‌ యజమానుల్ని కూడా అరెస్టు చేశారు. 12వ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత వేడుక చేసుకోవడానికి తన స్నేహితులతో కలిసి బార్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం సేవించి, తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఆ కారుకు ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదని తెలిసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని