Rachakonda CP: చిన్నారులను విక్రయిస్తున్న ముఠా అరెస్టు.. 16 మందిని రక్షించాం: రాచకొండ సీపీ

చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. 

Updated : 28 May 2024 17:05 IST

హైదరాబాద్‌: చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం పీర్జాదిగూడలో రూ.4.50లక్షలకు ఆర్‌ఎంపీ డాక్టర్‌ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్టు నిర్ధరించారు.

కేసు వివరాలను రాచకొండ సీపీ తరుణ్‌ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘‘ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్‌ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశాం. ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్టు చేశాం. వారిని అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించాం. సంతానం లేని వారికి పిల్లలను విక్రయిస్తున్నట్టు గుర్తించాం. దిల్లీ, పుణె నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్టు దర్యాప్తులో తేలింది. దిల్లీ, పుణెలో ఉన్నవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లింది. తల్లిదండ్రుల నుంచి రూ.50వేలకు కొనుగోలు చేసి.. రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు చిన్నారులను విక్రయిస్తున్నారు’’ అని రాచకొండ సీపీ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని