Road Accident: తునిలో యాసిడ్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన గ్యాస్‌ సిలిండర్ల లారీ!

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుని మండలం తేటగుంట వద్ద గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తోన్న లారీ.. వెనుక నుంచి యాసిడ్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. 

Updated : 27 May 2024 23:13 IST

తుని: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుని మండలం తేటగుంట వద్ద జాతీయ రహదారిపై హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తోన్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో యాసిడ్‌ ట్యాంకర్‌కు ఉన్న పైప్‌ ఒక్కసారిగా తెగిపోయి.. యాసిడ్‌ లీకైంది. ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఆ పొగను పీల్చిన ట్యాంకర్‌ డ్రైవర్‌, ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారంతా అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ పరిశ్రమకు చెందిన ఉద్యోగులు సైతం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.

యాసిడ్ వాసన చుట్టుపక్కల వ్యాపించడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న అన్నవరం ఎస్సై కిశోర్‌ కుమార్.. సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్‌ను జేసీబీ సాయంతో బయటకు తీసి తుని ఆస్పత్రికి తరలించారు. అనంతనం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. అస్వస్థకు గురైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని