Crime news : హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. కొండ చరియలు వాహనంపై పడి ఆరుగురు పోలీసుల మృతి

హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal pradesh) రాష్ట్రంలో కొండచరియలు (Landslide) వాహనంపై పడటంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఆరుగురు పోలీసులు (Police) ఉండటంతో తీవ్ర విషాదం నెలకొంది.

Published : 11 Aug 2023 22:32 IST

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండ చరియలు (Landslide) విరిగిపడటంతో పోలీసులు ప్రయాణిస్తున్న ఓ వాహనం ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు, ఓ పౌరుడు మృతిచెందాడు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంబా జిల్లాకు చెందిన పోలీసులు, కొంత మంది పౌరులతో కలిసి బైరాగడ్‌ నుంచి టిస్సా వైపు బయలుదేరారు. చురా ప్రాంతంలోని తార్వాయ్‌ బ్రిడ్జి వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న వాహనంపైకి ఓ బండరాయి దూసుకొచ్చింది. ఆ వేగం ధాటికి వాహనం అదుపుతప్పి సియుల్‌ నదిలో పడిపోయింది. 

నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఇంటర్‌ విద్యార్థిని

ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కన్నుమూసిన పోలీసులను రెండో ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌కు చెందినవారిగా గుర్తించారు. చంబా సరిహద్దులో వీరంతా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మృతి చెందిన పోలీసులను రాకేశ్‌ గోరా, ప్రవీన్‌ టాండన్‌, కమల్జీత్, సచిన్‌, అభిషేక్‌, లక్షయ్‌ కుమార్‌లుగా.. స్థానిక పౌరుణ్ని చంద్రూరామ్‌గా గుర్తించారు.   

ప్రమాద సమాచారం తెలిసి ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు తక్షణ సాయం అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రమాద ఘటనపై చురా భాజపా ఎమ్మెల్యే హన్సరాజ్‌ మాట్లాడుతూ ఎంతో కష్టపడి గత ప్రభుత్వం ఈ ప్రమాదకరమైన రహదారిని మూసివేసిందని చెప్పారు. ఆ ప్రమాదాల ముప్పును పట్టించుకోకుండా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ రహదారిని తెరిచిందన్నారు. తాజా ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రజా పనుల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆయన ఆరోపించారు. 

జూన్‌ 24న వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఆ రాష్ట్రంలో 234 మంది మృత్యువాత పడ్డారు. 83 చోట్ల కొండ చరియలు విరిగిపడి 39 మంది, వివిధ రోడ్డు ప్రమాదాల్లో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. రాగల రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటిస్తూ వాతావరణ శాఖ అధికారులు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. కొండచరియలు విరిగిపడటం, భారీ వరదలు, నదుల్లో, కాలువల్లో నీటి మట్టం పెరిగే ప్రమాదాలు పొంచి ఉన్నందున 17 తేదీ వరకు పౌరులు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని