Crime: చదివింది ఐదే.. ముఠా సాయంతో 500 కార్ల తస్కరణ!

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ముఠా ఏకంగా 500 కార్లు దొంగిలించడం గమనార్హం.

Published : 23 Feb 2024 23:26 IST

లఖ్‌నవూ: చదివింది ఐదో తరగతి వరకే. కానీ.. ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఏకంగా 500 వరకు కార్లను తస్కరించాడో వ్యక్తి. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. తాజ్‌ మహమ్మద్‌ అనే వ్యక్తి ఆటో నడుపుకొంటూ జీవనం సాగించేవాడు. 2012లో అతడికి రౌణక్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి కార్ల చోరీ మొదలుపెట్టారు. అక్కడి నుంచి ముఠాను విస్తరించి.. దిల్లీ, పరిసర ప్రాంతాల్లో దాదాపు 500 వరకు కార్లను ఎత్తుకెళ్లారు. ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు గాజియాబాద్‌లో తాజ్‌ మహమ్మద్‌ సహా నలుగురు నిందితులను అరెస్టు చేయగా.. వివరాలు బయటకువచ్చాయి. ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

నిరక్షరాస్యులే అయినప్పటికీ వారు యూట్యూబ్ నుంచి కార్లను ఎలా తస్కరించాలో నేర్చుకున్నారు. తొలుత రెక్కీ నిర్వహించేవారు. డిమాండ్‌ మేరకు సంబంధిత కారును ఎంచుకుని.. వెంట తెచ్చుకున్న ఉపకరణాలు, టాబ్లెట్‌లో డౌన్‌లోడ్ చేసిన హైటెక్‌ సాఫ్ట్‌వేర్‌ల సాయంతో అన్‌లాక్‌ చేసి ఎత్తుకెళ్లేవారు. విలాసవంత కార్లను ప్రధానంగా లక్ష్యంగా చేసుకునేవారని పోలీసులు తెలిపారు. దొంగిలించిన కార్లలో 200 వరకు వాహనాలను సంభాల్‌ జిల్లాలోని ఆమీర్‌కు, మరికొన్నింటిని గుజరాత్‌ వడోదరలోని మరో వ్యక్తికి విక్రయించారు. నిందితుల్లో కొంతమంది ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లివచ్చారు.

నకిలీ ఐడీతో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోకి.. వ్యక్తి అరెస్ట్‌

అమీర్, అతడి భార్య కూడా ఈ నేరాల్లో భాగస్వాములని.. కార్లను దొంగిలించడానికి వారు ముఠా సభ్యులకు సామగ్రి, రిమోట్ కంట్రోల్డ్ తాళాలను సరఫరా చేశారని పోలీసులు చెప్పారు. ఈ ముఠాకు దుబాయ్‌తోనూ సంబంధాలు ఉన్నాయి. లగ్జరీ కార్ల తాళాల కోసం తరచూ అక్కడికి వెళ్లేవారు. వాహనాన్ని విక్రయించగా.. వచ్చిన మొత్తాన్ని సమానంగా పంచుకునేవారు. విలాసవంత జీవనం కోసం ఈ దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. దిల్లీలోని రోహిణిలో ఓ ఏటీఎం నుంచి రూ.19.9 లక్షలనూ ఎత్తుకెళ్లినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు