IAF: నకిలీ ఐడీతో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోకి..... వ్యక్తి అరెస్ట్‌...

ఐఏఎఫ్‌ వింగ్ కమాండర్‌గా నటిస్తూ ఓ వ్యక్తి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోకి ప్రవేశించిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది.

Published : 23 Feb 2024 19:43 IST

దిల్లీ: ఐఏఎఫ్‌ వింగ్ కమాండర్‌గా నకిలీ ఐడీ కార్డుతో ఓ వ్యక్తి దిల్లీ కంటోన్మెంట్‌లోని పాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోకి  ప్రవేశించాడు. ఈవిషయాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందుతుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వినాయక్ చద్దా(Vinayak Chadha) అనే వ్యక్తి తన తండ్రికి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని డెంటల్ హాస్పిటల్‌లో చికిత్స చేయించాలనుకున్నాడు. తిమ్మయ్య రోడ్డులోని ఎయిర్‌ఫోర్స్‌ డెంటల్‌ హాస్పిటల్‌లో వింగ్‌ కమాండర్‌గా నటిస్తూ లోపలికి ప్రవేశించాడు. 

 నిందితుడు నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా వైమానిక దళ సిబ్బంది అతడిని పట్టుకున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(DCP) రోహిత్ మీనా తెలిపారు. అతను నకిలీ గుర్తింపు పత్రాన్ని ఉపయోగించి మొదటి గేటులోకి ప్రవేశించాడు. అనంతరం తనిఖీల్లో భాగంగా వైమానిక దళ భద్రతా సిబ్బంది అతడి ఐడీ నకిలీదని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

అతని వద్ద పలువురు రక్షణ సిబ్బంది పేర్లతో నకిలీ గుర్తింపుకార్డులు(forged identity cards), మద్యం కార్డులు ఉన్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాల్లో సబ్సిడీ ధరలకు మద్యం కొనుగోలు చేసేందుకు రక్షణ సిబ్బందికి ఈ కార్డులు ఇస్తారు. దర్యాప్తులో భాగంగా నకిలీ పత్రాలతో సంబంధమున్న సుల్తాన్‌పురికి చెందిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని