ట్రెక్కింగ్‌ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

స్కాట్లాండ్‌లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు.

Updated : 19 Apr 2024 13:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు (Students) ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి సరదాగా పర్వతారోహణకు వెళ్లిన వారు.. ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడి మృతిచెందారు. ఈ విషాదకర ఘటన స్కాట్లాండ్‌ (Scotland)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. (Telugu Students found dead in Scotland)

తెలుగు రాష్ట్రాలకు చెందిన జితేంద్రనాథ్‌ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం మరికొందరు భారత స్నేహితులతో కలిసి పెర్త్‌షైర్‌లోని ‘లిన్‌ ఆఫ్‌ తమ్మెల్‌’కి వెళ్లారు. రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో వీరు ట్రెక్కింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు.

సమాచారమందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో వీరి మృతదేహాలను గుర్తించారు. ఈ ప్రమాదంపై లండన్‌లోని భారత హైకమిషన్‌ అధికారి ఒకరు స్పందించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను భారత్‌కు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.

జితేంద్రనాథ్ గతంలో అమెరికాలోని కనెక్టికట్‌ యూనివర్సిటీలో చదివినట్లు తెలుస్తోంది. చాణక్య 2022లోనే హైదరాబాద్‌ జేఎన్‌టీయూ వర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినట్లు సమాచారం. ఘటనపై డూండీ యూనివర్సిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని