logo

రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్‌ను గెలిపించాలి

మనిషికి చేతులు ఎంతముఖ్యమో.. దేశానికి చేతిగుర్తు పార్టీ అవసరం అంతే ఉందని కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ కోరారు.

Published : 28 Apr 2024 03:23 IST

రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ

జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాదసభలో అభివాదం చేస్తున్న రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్‌, ఏఐసీసీ కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ తదితరులు

శ్రీరాంపూర్‌, మంచిర్యాల సిటీ, నస్పూర్‌, శ్రీరాంపూర్‌ గ్రామీణం- న్యూస్‌టుడే: మనిషికి చేతులు ఎంతముఖ్యమో.. దేశానికి చేతిగుర్తు పార్టీ అవసరం అంతే ఉందని కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ కోరారు. శనివారం రాత్రి జైపూర్‌ మండలం ఇందారం మూల మలుపు నుంచి నస్పూర్‌ వరకు దీప్‌దాస్‌ మున్షీ, మంత్రి శ్రీధర్‌బాబు, అభ్యర్థి వంశీకృష్ణ, ప్రజాప్రతినిధులు ర్యాలీగా నస్పూర్‌కు వచ్చారు. అనంతరం నస్పూర్‌లో కార్మిక గర్జనసభ, మంచిర్యాలలో ప్రజా ఆశీర్వాద సభల్లో ఆమె మాట్లాడారు. యువతతోనే దేశ భవిష్యత్తు.. అందుకే పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థిగా యువకుడిని పోటీలో ఉంచామన్నారు. దేశంలో యువకుడు ప్రధాని కావాలంటే రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భారాస నియంత పాలనకు చరమగీతం పాడారో మరోసారి ఓటుతో భాజపాను ఇంటికి పంపించాలని కోరారు. కాంగ్రెస్‌ హామీ ఇస్తే అమలు చేస్తుందని, అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలన్ని ప్రజలకు చేరువ చేస్తామన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈసారి కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. భాజపా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు వేశారా? అని ఆమె ప్రశ్నించారు. ఈసారి భాజపా ఎన్నికల హామీలకు బదులుగా మోదీ గ్యారంటీల పేరిట ప్రచారం చేస్తున్నారని వ్యక్తి పూజపై ఆమె పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈసారి ఇక్కడి ప్రజలు కానుకగా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారన్నారు. అదే విధంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే పార్లమెంటు ఎన్నికల్లో భాజపాను గద్దె దించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, మహిళా సమస్యల పరిష్కారం, కార్మిక, కర్షకుల, శ్రామికుల కోసం కాంగ్రెస్‌ పనిచేస్తుందని చెప్పారు.

విశ్రాంత కార్మికులకు రేషన్‌కార్డులు ఇవ్వాలని వినతి

అర్హులైన సింగరేణి విశ్రాంతి కార్మికులకు రేషన్‌ కార్డులు ఇవ్వాలని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబును ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు కోరారు. ప్రజల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన 45 రోజుల్లోనే నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీర్చినట్లు పేర్కొన్నారు. 4 వేల మంది కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించామని, మరో 1500 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చిందని తెలిపారు. కార్మిక వారసుల ఉద్యోగ వయసును 40 ఏళ్లకు పెంచే విషయంపై సంబంధిత మంత్రులు సింగరేణి యాజమాన్యంతో చర్చిస్తున్నారని గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పని చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ పేర్కొన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ పరిధిలో పబ్లిక్‌ రంగ సంస్థలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు కృషి చేస్తానని పెద్దపల్లి లోక్‌సభ నియోజకర్గ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డీసీసీ అభ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రోహిత్‌ చౌదరి, ఏఐసీసీˆ కార్యదర్శులు విశ్వనాథ్‌, వేణుగోపాల్‌, యువజన కాంగ్రెస్‌ జాతీయ, రాష్ట్ర నాయకులు డి.శ్రీనివాస్‌, శ్రావణ్‌, శశాంక్‌సింగ్‌, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌, సుర్మిళ్ల వేణు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

హరీశ్‌రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి: మంత్రి శ్రీధర్‌బాబు

శ్రీరాంపూర్‌ వద్ద ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, ఎన్నికల నియమావళి పూర్తయిన వెంటనే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే సింగరేణిలో కొత్త గనులు వస్తాయని చెప్పారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్నారు. తొండి మాటలు చెబుతున్న హరీశ్‌రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని