logo

ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు.

Published : 28 Apr 2024 03:27 IST

బెజ్జూరులో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, చిత్రంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

బెజ్జూరు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు. శనివారం బెజ్జూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేతిగుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత, ఉపాధిహామీ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని తెలిపారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా జమ చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. దేవుడిని ముందు పెట్టి భాజపా రాజకీయాలు చేస్తుందన్నారు. మోదీ చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో రాముడిని చూపుతున్నారని తెలిపారు. రూ.2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. పదేళ్లలో మోదీ, కేసీఆర్‌ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని, రైతుబంధు రాని అన్నదాతలందరికీ వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ సర్కారు నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిందని, త్వరలో పేదలకు ఇళ్లు అందించి పింఛన్లు పెంచుతామని తెలిపారు. ఎంపీ అభ్యర్థి సుగుణ మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల అభివృద్ధే కాంగ్రెస్‌ లక్ష్యం అన్నారు. తనకు ఎంపీగా అవకాశం ఇస్తే ఉమ్మడి జిల్లాలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లకు కేంద్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు పూర్తి కాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో 560 మంది పేదలకు పెళ్లిళ్లు చేసి కల్యాణలక్ష్మి ఇప్పించినట్లు గుర్తు చేశారు. వివిధ పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం మంత్రిని పలువురు సన్మానించి సమస్యలపై వినతిపత్రాలను సమర్పించారు. కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి శ్రీనివాస్‌, జడ్పీ ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు, జడ్పీ మాజీ ఛైర్మన్‌ గణపతి, ఎంపీపీలు రోజా రమణి, నానయ్య, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ ఓంప్రకాశ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీవర్ధన్‌, మండల అధ్యక్షుడు శంకర్‌, ఎంపీటీసీలు పర్వీన్‌సుల్తానా, శ్రీనివాస్‌, వెంకన్న, కోఆప్షన్‌ సభ్యుడు బషరత్‌ఖాన్‌, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు