logo

వంద ఎకరాలు కొట్టేసే పన్నాగం

‘వడ్డించే వాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరుతాయి’ అన్న చందంగా అధికారులు, నేతలు కుమ్మక్కై వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం సాగుతోంది.

Updated : 28 Apr 2024 06:32 IST

నేతలు, అధికారుల కుమ్మక్కు

582 సర్వే నంబరులోని భూమి

ఈనాడు, ఆసిఫాబాద్‌: ‘వడ్డించే వాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరుతాయి’ అన్న చందంగా అధికారులు, నేతలు కుమ్మక్కై వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం సాగుతోంది. ఈ తతంగమంతా గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతూ.. ధరణి రిజిస్ట్రేషన్‌ వరకు వచ్చి నిలిచిపోయింది. పైరవీలతో ఈ భూమిని దక్కించుకోవాలని కొందరు వ్యక్తులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని సమాచారం. సర్వే నంబర్లు మార్చేస్తూ, కొత్తవి సృష్టిస్తూ సాగుతున్న ఈ భూ దందాలో కొందరు జిల్లాస్థాయి అధికారులతోపాటు మరికొందరు ముఖ్య నాయకులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ భూ పందేరాలకు అడ్డుకట్ట పడేలా రెవెన్యూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  

జిల్లావ్యాప్తంగా నిజాం కాలంలో చాలా మందికి వందల ఎకరాల పట్టాలు ఉండేవి. ఇదే విధంగా సిర్పూర్‌(టి) పట్టణానికి చెందిన నాగేందర్‌సింగ్‌కు 582 సర్వే నంబరులో 100 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇందులో సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో కొన్ని నివాసాలు, పంట పొలాలతోపాటు, రైల్వే లైన్‌ పక్కన ఉన్న చిట్టడివి, మామిడి, నిమ్మ తోటలు, మరికొంత పోరంబోకు భూములు ఉన్నాయి. సదరు పట్టాదారు మహారాష్ట్రలో స్థిరపడ్డాడు. ఈ భూములపై కొందరు నేతలు, అధికారుల కళ్లు పడ్డాయి. తమకు అనుకూలమైన నలుగురు వ్యక్తుల పేర్లతో ఈ భూమిని కాజేయడానికి తలా 25 ఎకరాలు వచ్చేలా పన్నాగం పన్నారు.

సర్వే నంబరునే మార్చి...

582 సర్వే నంబరును మార్చి 523 సర్వే నంబరుగా రికార్డులు తయారు చేశారు. వాస్తవంగా 523 సర్వే నంబరులో 812 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. ఇవన్నీ రక్షిత అటవీ భూములు, నిషేధిత జాబితాలో ఉన్నాయి. కొందరికి లావుణి పట్టాలు ఉన్నాయి. వీరందరూ ఎకరం, రెండు ఎకరాల చొప్పున సాగు చేసుకుంటున్నారు. పాత సర్వే నంబరు 582 అని చెబుతూ కొత్త సర్వే నంబరు 523లో నలుగురు వ్యక్తులు వంద ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేయగా ఇంతకుముందు పనిచేసిన తహసీల్దార్‌లు నిరభ్యంతర పత్రాలు ఇచ్చేశారు. సర్వేయర్‌లు కొలతలు తీసి హద్దులు నిర్ధారించేశారు. ఇక పట్టాలు ఇవ్వడమే ఆలస్యం.

ధరణిలో 523 సర్వే నంబరు నిషేధిత జాబితాలో ఉండగా, 812 ఎకరాల భూమి అటవీ భూమిగా ఉన్న వివరాలు

ప్రభుత్వ భూమి ఉండటంతోనే..

మాజీ సర్వే నంబరు అంటేనే చాలా వరకు ప్రభుత్వ భూమి ఉంటుందని సీనియర్‌ రెవెన్యూ అధికారి తెలిపారు. అంటే 582లో ఉన్న ప్రభుత్వ భూమి చేతిరాతగా సదరు పట్టదారు పేరు మీద 100 ఎకరాల వరకు ఉంది. ఇంత మేరకు భూమి ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉండటంతో, నలుగురు వ్యక్తులు రంగ ప్రవేశం చేసి సర్వే నంబరు మార్చి భూమిని కాజేసే యత్నం జరుగుతున్నట్లు సమాచారం.  

582 సర్వే నంబరులో మార్చుతూ 523 (మాజీ) కొత్త సర్వే నంబరులో పట్టా భూమిగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన ధ్రువపత్రం

అధికారులు ఏం చేస్తున్నారు?

ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ ప్రకారం ఒక్క వ్యక్తికి కేవలం 50 ఎకరాలలోపు మాత్రమే ఉండాలి. ప్రస్తుతం నాగేందర్‌ సింగ్‌ అనే వ్యక్తికి వంద ఎకరాల భూమి ఉన్నా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయమై ఏ అధికారి వద్ద స్పష్టమైన సమాధానం లేకపోవడం గమనార్హం. ఏం చెబితే తమ మెడకు ఏం చుట్టుకుంటుందో అని, గతంలో ఉన్న అధికారులు ఈ తప్పు చేశారనే సమాధానాలే రెవెన్యూ అధికారుల నుంచి వస్తున్నాయి. సర్వే నంబర్లనే మార్చుతూ అప్పనంగా వందల ఎకరాల భూములను కొట్టేయాలని చూస్తున్న వారిని, వీరికి సహకరిస్తున్న అధికారులను ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని