logo

అక్రమాలకే ప్రా‘ధాన్యం’?

ఎక్కడ ముడిసరకు లభ్యమవుతుందో సాధారణంగా అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం ధాన్యం ఆశించిన రీతిలో పండకున్నా ఇక్కడ ఏకంగా తొమ్మిది రైస్‌ మిల్లులు ఏర్పాటయ్యాయి.

Updated : 28 Apr 2024 06:29 IST

బియ్యం మిల్లుల ఏర్పాటుపై అనుమానాలు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం

ఆదిలాబాద్‌లోని రైస్‌ మిల్లు

ఎక్కడ ముడిసరకు లభ్యమవుతుందో సాధారణంగా అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం ధాన్యం ఆశించిన రీతిలో పండకున్నా ఇక్కడ ఏకంగా తొమ్మిది రైస్‌ మిల్లులు ఏర్పాటయ్యాయి. పటాన్‌చెరు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న ఓ రైస్‌మిల్లులో ఆదిలాబాద్‌లోని వినాయక ట్రేడర్స్‌ పేరిట ఎఫ్‌సీఐ ముద్రవేసి ఉన్న బియ్యం సంచులను పోలీసులు పట్టుకోవడం సంచలనం రేపింది. జిల్లాలోని రైస్‌మిల్లుల్లో అక్రమాలు జరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనంగా మారింది.

ఆదిలాబాద్‌ జిల్లాలో కేవలం ఉట్నూరు మండలంలోనే వరి సాగు చేస్తారు. ఏటా ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్‌లో 2 వేల టన్నులు, రబీలో 600 టన్నుల వరకు ధాన్యం సేకరిస్తున్నారు. ఎంత లేదన్నా ఏడాదికి 3 వేల టన్నుల ధాన్యం దాటడం లేదు.

జిల్లాలో సేకరించిన ధాన్యం ఒక రైస్‌ మిల్లుకే సరిపోతుంది.  ఆదిలాబాద్‌ పట్టణ శివారుల్లోని రాంపూర్‌, బట్టిసావర్గాం, పొన్నారి, దస్నాపూర్‌ ఏరియాల్లో మొత్తం తొమ్మిది రైస్‌ మిల్లులు ఏర్పడ్డాయి. 2019 నుంచి ఇది మొదలైంది. తొలుత ఒకే రైస్‌ మిల్లు ఉండగా ఆ తరువాత కొన్ని నెలల్లోనే చకచకా పెరుగుతూ వచ్చాయి. జిల్లాలో సేకరించిన ధాన్యం తక్కువగా ఉండటంతో ఒక్కో మిల్లుకు రెండు మూడు లారీలకు సరిపడా ధాన్యాన్ని అధికారులు పంపిస్తున్నారు. ఇది ఏమాత్రం సరిపోదు. పోని ప్రైవేటు పరంగా మిల్లు యజమానులు కొనుగోలు చేద్దామంటే ఇక్కడ ధాన్యం పంటనే లేదు. మరోప్రాంతంనుంచి ఇక్కడికి ధాన్యం తీసుకురావడానికి రవాణా ఖర్చులే తడిసి మోపెడవుతాయి. దీనివల్ల నష్టాలు ఎక్కువవుతాయి. అయినా ఇక్కడ తొమ్మిది రైస్‌ మిల్లులు ఉండటం వెనుక మర్మమేంటనేది అధికారులకే తెలియాలి. మిల్లుల పేరిట కొందరు అక్రమ దందా నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది ఈ మిల్లులకు మంచిర్యాల జిల్లా నుంచి అధికారులు ధాన్యాన్ని పంపించారు. అవే నిల్వలు ప్రస్తుతం అక్కడి గోదాంలలో నిల్వలున్నాయని చెబుతున్నారు. మంచిర్యాలలోనే కొత్త మిల్లులు ఏర్పాటు చేయకుండా పంట లేనిచోట ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఈ జిల్లాకు పక్కనే మహారాష్ట్ర ప్రాంతం ఉంది. అక్కడ ధర అధికంగా ఉండటం వల్ల ధాన్యం, బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే ప్రచారం ఉంది.

ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు సుధారాణిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. తాను రాక ముందు నుంచి మిల్లులు ఉన్నాయి. కొత్త మిల్లులకు దరఖాస్తులు వచ్చినా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. జిల్లాలో ధాన్యం నిల్వల వివరాలు సంగారెడ్డి పోలీసులు వచ్చి తీసుకెళ్లారన్నారు.

నిజామాబాద్‌ జిల్లావాసులకు సంబంధం

ఇప్పటికే తొమ్మిది రైస్‌ మిల్లులుండగా, కొత్తగా మరో అయిదింటికి అనుమతులు ఇచ్చేందుకు అధికారుల వద్ద దస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. అక్రమాల్లో పేరుగాంచిన వ్యాపారులే ఈ మిల్లుల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పటాన్‌చెరులో కేసు నమోదైన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన వ్యాపారి బినామి పేర్లపై ఆదిలాబాద్‌ జిల్లాలో అయిదు మిల్లులు నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్‌కు చెందిన కొందరు రాజకీయ నాయకులకు జిల్లాలోని మిల్లుల్లో భాగస్వామ్యం ఉందని సమాచారం. ఇప్పటికే మిల్లులు, గోదాంలు లీజుకిచ్చిన ఆదిలాబాద్‌లోని వ్యాపారులు, కొందరు కూలీలు, డ్రైవర్లను పటాన్‌చెరు పోలీసులు తీసుకెళ్లి విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని