logo

ఓటు మీది.. అభివృద్ధి మాది

పదేళ్లలో కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస చేసిందేమి లేదని, కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Published : 29 Apr 2024 03:03 IST

జ్యోతిబాఫులే కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి : మంత్రి సీతక్క

మాట్లాడుతున్న మంత్రి సీతక్క చిత్రంలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, సీనియర్‌ నాయకులు వేణుగోపాల్‌రావు, పురాణం సతీష్‌, అజ్మీరా శ్యామ్‌నాయక్‌

కెరమెరి, న్యూస్‌టుడే : పదేళ్లలో కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస చేసిందేమి లేదని, కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం కెరమెరి మండల కేంద్రంలోని స్టార్‌ ఫంక్షన్‌ హాల్‌లో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. భాజపా మూడోసారి అధికారంలో వస్తే అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు. జీఎస్టీ పేరుతో సామాన్యులపై భారం వేస్తుందని విమర్శించారు. జ్యోతిబాఫులే కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి మాలీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరుల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కేస్లాగూడ ప్రాజెక్టు, ఆసిఫాబాద్‌ నుంచి ఉట్నూరు వరకు రోడ్డు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు అధిక నిధుల తెచ్చి అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణను అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనేతరుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డకు కాంగ్రెస్‌ పార్టీ అవకాశం ఇచ్చిందని, ఒకసారి గెలిపించాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి సమక్షంలో ఆయా పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్‌, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జి అజ్మీరా శ్యాంనాయక్‌, సీనియర్‌ నాయకులు వేణుగోపాల్‌ చారి, పురాణం సతీష్‌, గణేష్‌ రాఠోడ్‌, మండల అధ్యక్షుడు కుసుంరావు, మునీర్‌ హైమద్‌, ఎల్లప్ప నాయకులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం

జైనూర్‌ : ఎంతో మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సద్గురు పూలాజీబాబా అని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం మండలంలోని పట్నాపూర్‌ సిద్ధేశ్వర్‌ సంస్థాన్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ బాబా ఆలయ పనుల పునరుద్ధరణకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాబా హితబోధనలతో ఎంతో మంది ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మికత వైపు దృష్టిసారించారన్నారు. సద్గురు పూలాజీబాబా చరిత్ర ప్రపంచానికి తెలిసేలా అభివృద్ధి చేపడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి సుగుణ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అజ్మీరా శ్యామ్‌నాయక్‌, సంస్థాన్‌ అధ్యక్షుడు కేశవ్‌ ఇంగిళే, బ్లాక్‌ అధ్యక్షుడు ఆయ్యుబ్‌ఖాన్‌, సంస్థాన్‌ నిర్వాహక కమిటీ సభ్యుడు డుక్రే సుభాష్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని