logo

పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ

రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.

Updated : 30 Apr 2024 06:49 IST

ప్రత్యేక చర్యలతో పోలింగ్‌శాతం పెంపు

లక్షెట్టిపేట, న్యూస్‌టుడే: రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. గత లోక్‌సభ ఎన్నికలు 2019 ఏప్రిల్‌ 11న జరిగాయి. ఈ సారి ఎన్నికలు మన రాష్ట్రంలో నెల రోజులు ఆలస్యంగా మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎండల తీవ్రత 46 డిగ్రీ సెంటీ గ్రేడ్‌ను దాటి ఉండే అవకాశముంది. మరో వైపు వడగాలులు, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఎన్నికల్లో కొన్ని నియోజక వర్గాల్లోని పోలింగ్‌ బూత్‌లలో 30 శాతం లోపు పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది, ఓటర్లు వేడిమి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ శాతం పెంచేందుకు, ఎండ తీవ్రత కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కథనం.

వృద్ధులకు ఇంటి నుంచే అవకాశం

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 80 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి నుంచి ఓటువేసే సదుపాయం కల్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. 80 ఏళ్లు పైబడిన వారికి కూడా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఇస్తే బాగుం డేది. అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.  
ఇక ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో సగటున 71.41 శాతం పోలింగ్‌ నమోదైంది. కొన్ని పోలింగ్‌ బూత్‌లలో స్వల్ప ఓటింగ్‌ నమోదైంది. అదే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  సగటున 84 శాతం ఓటింగ్‌ నమోదు కావడం విశేషం.  సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో శాసన సభ ఎన్నికల్లో 86శాతానికి పైగా ఓటింగ్‌ నమోదు కాగా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సిర్పూర్‌లో 69 శాతం, ఆసిఫాబాద్‌లో 73 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం.  


ఏం చేయాలంటే...

  • కేంద్రాల వద్ద షామియానాలు, చలువ పందిరిలు ఏర్పాటు తప్పనిసరిగా చేపట్టాలి.
  • సిబ్బందికి గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు తలెత్తినా ఇబ్బంది లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలి.
  • ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రతి పోలింగ్‌ బూత్‌లో కూలర్లు గాని ఫ్యాన్లు గాని ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  • దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులకు ప్రత్యేక వరుస ఏర్పాట్లు చేయాలి.
  • ప్రతి పోలింగ్‌ కేంద్రంలో చల్లని తాగునీటి సౌకర్యం కల్పించాలి.

గత లోక్‌సభ ఎన్నికల్లో ఇలా..

2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సగటున 56.82 శాతం ఓటింగ్‌ నమోదు కాగా మంచిర్యాల నియోజకవర్గం పరిధిలో 59.40 శాతం నమోదైంది. లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజక వర్గాల సగటు 65.57 శాతం నమోదు కావడం గమనార్హం. వీటిలో రామగుండం నియోజకవర్గ పరిధిలోని వెంకట్రావుపల్లి పోలింగ్‌ బూత్‌లో 27.27 శాతం, అల్లూరులో 30.56 శాతం నమోదు కాగా మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్‌లోని 486 పోలింగ్‌ బూత్‌లో 31 శాతం పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. దీనికి అప్పట్లో భానుడి తీవ్రతను కారణంగా చూపారు. గతేడాది ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరుగగా ఈసారి మే 13న పోలింగ్‌ జరుగనున్నది. ఆసమయంలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుంది. ఇది పోలింగ్‌ శాతంపై తీవ్ర ప్రభావం చూపకుండా ఇప్పటి నుంచే తగు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.


కాసిపేటలో..

ఇక్కడ కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా కాసిపేటలోని 27వ నెంబరు పోలింగ్‌ కేంద్రం. పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలోకి వచ్చే ఈ కేంద్రం ఆవరణలోనే రెండు పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. పాఠశాల ఆవరణ చిన్నగా ఉండటంతో 30 మంది కన్నా ఎక్కువ మంది క్యూలో నిల్చొని ఉండటానికి అవకాశముండదు. ఇక్కడ ఆవరణతో పాటు రోడ్డు పైన కూడా షామియానా వేయగలిగితేనే ఫలితం ఉంటుంది.


రాంపూర్‌లో షామియానా ఏర్పాటు చేయాల్సిందే..

ఇది మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని రాంపూర్‌ పోలింగ్‌ స్టేషన్‌. ఇక్కడ పోలింగ్‌ బూత్‌కు వరండా కూడా లేదు. క్యూ లైన్లలో నిల్చొనే ఓటర్లకు నీడ కల్పించేందుకు కచ్చితంగా షామియానా ఏర్పాటు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని