logo

మెగాస్టార్‌ గుండెలపై గన్‌ పెట్టా!

మన్యంలోని మారుమూల కుగ్రామంలో పుట్టి వెండితెరపై కనిపించడం అంత సులభం కాదు. అయితే ఆ ఆదివాసీ గిరిజన యువకుడు పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నాడు.

Updated : 12 Aug 2023 11:56 IST

ఆయనతో నటించడం ‘మధు’రానుభూతి
‘న్యూస్‌టుడే’తో అనుభవాలు పంచుకున్న మేడీ

భోళాశంకర్‌లో చిరంజీవితో సన్నివేశం

గూడెంకొత్తవీధి (పాడేరు), న్యూస్‌టుడే: మన్యంలోని మారుమూల కుగ్రామంలో పుట్టి వెండితెరపై కనిపించడం అంత సులభం కాదు. అయితే ఆ ఆదివాసీ గిరిజన యువకుడు పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నాడు. చిత్రసీమలోకి అడుగుపెట్టడమే కాకుండా అందులో రాణిస్తూ మరింత మందికి స్ఫూర్తినిస్తున్నాడు. తన ప్రతిభ, దేహదారుఢ్యంతో మేకర్స్‌ని మెప్పించి మెగాస్టార్‌ చిరంజీవితో కలసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అతడే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గెమ్మెలి మధుకర్‌రాజ్‌ అలియాస్‌ మేడీ.

గూడెంకొత్తవీధి మండలం మారుమూల గిరిజన పల్లె లంకపాకలు మా స్వగ్రామం. అక్కడి కాఫీ తోటల మధ్య పెరిగాను. నాన్న కామేశ్వరరావుకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాం. అక్కడ సినిమాలు చూసీచూసీ నేనూ సినీ రంగంలో రాణించాలని కలలుకన్నాను. నాన్నకు ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. ఆయన ఉద్యోగం చేస్తూనే ఫొటోలు తీసేందుకు గిరిజన గ్రామాల్లో తిరిగేవారు. ఆయనతోపాటే నేనూ ఫొటోలు తీస్తూ పట్టుసాధించాను. అదే సినిమా ఇండస్ట్రీకి వెళ్లేందుకు దారి చూపింది. విశాఖపట్నంలో ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సమయంలో సినిమా అవకాశం వచ్చింది. అది మొదలు అయిదేళ్లలో స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీగా, నటుడిగా 73 సినిమాలకు పనిచేశాను. అధికంగా విలన్‌ పాత్రల్లోనే కనిపించా.

అడవి శేష్‌ సినిమాలో విలన్‌గా...


సినీ ప్రపంచంలోకి వచ్చిన అయిదేళ్లలో మధుకర్‌రాజ్‌ స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా, నటుడిగా 73 చిత్రాలకు పనిచేశాడు. అతడు తాజాగా భోళాశంకర్‌ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవితో కలసి స్క్రీన్‌ని పంచుకున్నాడు. ఆ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా తన అనుభూతిని ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే....


రామ్‌లక్ష్మణ్‌ల ద్వారా అవకాశం:

నాకు చిన్నప్పటి నుంచి రకరకాల హెయిర్‌స్టైల్స్‌ చేసుకోవడం అలవాటు. సినిమా ఇండస్ట్రీకీ వెళ్లిన తరువాత ఇది ఇంకా ఎక్కువైంది. నా దేహదారుఢ్యం, హెయిర్‌స్టైల్‌ ఫైట్‌ మాస్టర్‌లైన రామ్‌లక్ష్మణ్‌లకు నచ్చింది. వాళ్లు చేసే సినిమాల్లో చాలా అవకాశాలు ఇచ్చారు. అలా ఒక రోజు రామ్‌లక్ష్మణ్‌ల నుంచి కాల్‌ వచ్చింది. ఓ క్యారెక్టర్‌ ఉంది చేస్తావా అని అడిగారు. చేస్తానని చెప్పాను. ఎవరితోనో తెలుసా అంటూ మెగాస్టార్‌ చిరంజీవితో అని చెప్పగానే షాక్‌ అయ్యా. వారు చెప్పినట్టుగానే ఆయనతో పనిచేసే అవకాశం కల్పించారు.


గిరిజనుడంటే చిరంజీవి నమ్మలేదు:

ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీ మగమహారాజుగా వెలుగొందుతున్న మెగాస్టార్‌ చిరంజీవితో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. షూటింగ్‌ జరిగే సమయంలో రామ్‌లక్ష్మణ్‌ మాస్టార్లు నన్ను చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లి పరిచయం చేశారు. ఈ అబ్బాయి గిరిజనుడు అంటే ఆయన నమ్మలేదు. నన్ను విదేశీయుడు అనుకున్నారట. అప్పుడు మాస్టార్లు ఈ అబ్బాయి మన చింతపల్లి ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వాడే అని వివరించారు. దీంతో ‘అవునా.. మన ఆంధ్రుడా, మనోడేనా!’ అంటూ దగ్గరకు తీసుకుని ఆయన అభినందించారు. ఆయన ఛాతీపై గన్‌పెట్టే సీన్‌ చేసేటప్పుడు కంగారు, భయం చిరంజీవి కనిపెట్టేశారు. నన్ను దగ్గరకు పిలిచి కొన్ని చిట్కాలు చెప్పారు. అంత పెద్ద హీరో సరదాగా ఉండటంతో భయం పోయింది. భోళాశంకర్‌ ద్వారా ప్రత్యేక గుర్తింపు వస్తోంది. అందుకు రామ్‌లక్ష్మణ్‌ మాస్టార్లు, దర్శకుడు మోహర్‌రమేష్‌లకు కృతజ్ఞుడినై వుంటా.  


గిరిజన ప్రాంత అందాలు ప్రపంచానికి చూపిస్తా

మధుకర్‌రాజ్

మా గిరిజన ప్రాంతంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ప్రకృతి అందాలకు కొదవే లేదు. అందుకే చిత్ర పరిశ్రమ ఎప్పుడూ గిరిజన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపేందుకు ఇష్టపడుతోంది. మా ప్రాంత విశేషాలన్నింటినీ ప్రపంచానికి తెలియజేసేందుకు యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించా. త్వరలోనే ఆయా ప్రాంతాలన్నీ తిరిగి నా ఛానల్‌ ద్వారా ప్రచారం చేస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని