logo

కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి ఆరోపించారు.

Published : 28 Apr 2024 02:09 IST

రాంబాబుకు కండువా కప్పి ఆహ్వానిస్తున్న శిరీషాదేవి

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి ఆరోపించారు. రాజవొమ్మంగిలో శనివారం మహిళలతో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు చెల్లుబోయిన శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూ రమేష్‌తో కలసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీషాదేవి మాట్లాడుతూ చంద్రబాబు మహిళా పక్షపాతి అని గతంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రస్తుతం కూడా మరెన్నో పథకాలకు రూపకల్పన చేశారన్నారు. సొంత చెల్లి, తల్లికే న్యాయం చేయని జగన్‌ ఇక రాష్ట్ర మహిళలకు ఏం న్యాయం చేస్తారన్నారు. ఇది మహిళలందరు గమనించాలన్నారు. ఈ వైకాపా ప్రభుత్వంలో దళిత యువకుడి హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంత బాబు కొద్ది నెలల్లోనే బయటకు రాగా కోడికత్తి కేసులో నిందితుడు బయటకు రావడానికి చాలా ఏళ్లు పట్టిందని ఆరోపించారు. వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే ధనలక్ష్మికి పనిచేయాలని ఉన్నా వెనుక ఉన్న వ్యక్తి చేయనివ్వరని విమర్శించారు. తెదేపాలో అటువంటిది ఉండదన్నారు. సాధారణ మహిళ, అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేసిన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. జడ్డంగి నుంచి ఆదివాసీ నాయకుడు టి.రాంబాబు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు జి.పెద్దిరాజు, ఎం.సావిత్రి, ఎం.కేశవ్‌, బి.త్రిమూర్తులు, స్వప్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు