logo

బీఎన్‌ రహదారి ఊసెత్తని జగన్‌చప్పగా ప్రసంగం.. నాయకగణం డీలా

సీఎం జగన్‌ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు.

Published : 30 Apr 2024 03:19 IST

మద్యం దుకాణం వద్ద వైకాపా కార్యకర్తల బారులు

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, చోడవరం: సీఎం జగన్‌ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు. చోడవరంలో జరిగిన సభలో మాటకు ముందు, తర్వాత గోవిందా.. గోవిందా అనడం గమనార్హం. కొత్తూరు నాలుగు రోడ్ల కూడలికి సమీపంలోని తెదేపా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే జగన్‌ వాహనంపై నుంచి ప్రసంగించారు. నానా ఇబ్బందులు పడి జనాన్ని తరలించిన నాయకులు చప్పగా సాగిన జగన్‌ ప్రసంగంతో డీలా పడ్డారు. జగన్‌ తన ప్రసంగంలో ఎక్కడా బీఎన్‌ రహదారి విస్తరణ, చక్కెర కర్మాగారాల ప్రస్తావన తీసుకురాలేదు. ధర్మశ్రీ రాసి ఇవ్వగా.. గోవాడ చక్కెర కర్మాగారాన్ని ఆదుకున్నామంటూ ముక్తసరిగా చెప్పి ముగించేశారు. చంద్రబాబును విమర్శించడానికే సమయం కేటాయించారు. తిరుగు ప్రయాణంలో హెలిపాడ్‌ వద్ద జగన్‌ను మాజీ మంత్రులు బలిరెడ్డి సత్యారావు కుమార్తె నాగమణి, ఎం.బాలరాజు కుమార్తె, మనుమరాలు కలిశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రునాయుడు బస్సు వద్ద జగన్‌ను కలిసి మాట్లాడారు.

సీఎం ప్రసంగిస్తుండగా వెనుదిరిగి వెళ్తున్న జనం

పది కి.మీ. ముందే బస్సులు బంద్‌..

సీఎం జగన్‌ ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు చూపించారు. చోడవరం ప్రధాన రహదారిపై రోడ్‌షో ఏర్పాటు చేయడంతో ఇరువైపులా పది కి.మీ ముందే వాహనాలను నిలిపేశారు. విశాఖ నుంచి చోడవరం, మాడుగుల, పాడేరు వెళ్లే బస్సులు సీఎం సభకు 7 కి.మీ దూరంలోని వెంకన్నపాలెం సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద ఆపేశారు. పాడేరు, నర్సీపట్నం నుంచి చోడవరం వైపు వచ్చే బస్సులను 10 కి.మీ ముందే వడ్డాది కూడలి వద్ద నిలిపేశారు. దీంతో అక్కడి నుంచి చోడవరంతో పాటు ఎగువ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులంతా ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోలు సైతం కొంత దూరం వరకే అనుమతించి అక్కడ నుంచి ఇతర మార్గాలకు మళ్లించడంతో పిల్లాపాపలతో అవస్థలు పడ్డారు. వాహనాల్లేక ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. సీఎం హెలికాప్టర్‌ ప్రయాణానికి అడ్డుగా ఉన్నాయని విద్యుత్తు తీగలను కట్ చేయడంతో కొన్ని వీధుల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రోడ్‌షో జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల దుకాణాలన్నీ   బంద్‌ చేసుకోవాల్సి వచ్చింది. మద్యం దుకాణం దగ్గర మాత్రం సీఎం సభకు వచ్చిన వారు బారులు తీరారు. ఒక్కొక్కరికి రూ.300, బిర్యాని పొట్లాం ఇచ్చినట్లు సభకు వచ్చిన కొంత మంది మహిళలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు