logo

వైకాపాది దుర్మార్గ పాలన

వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు.

Published : 30 Apr 2024 03:23 IST

చింతపల్లి సభలో ప్రజలకు అభివాదం తెలియజేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి

కొయ్యూరు, చింతపల్లి, న్యూస్‌టుడే: వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. తెదేపా, భాజపా, జనసేన ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో సోమవారం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గీత, గిడ్డి ఈశ్వరిలకు స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చింతపల్లి ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో నేతలు మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం గిరిజనులకు సంక్షేమ పథకాలు రద్దు చేసిందని గీత, గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. ప్రత్యేక డీఎస్సీ ఊసే లేదన్నారు. వైకాపా దుర్మార్గ పాలనతో అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు రోడ్డెక్కాల్సి వచ్చిందని చెప్పారు.  విద్యుత్తు ఛార్జీలను తొమ్మిది సార్లు పెంచారన్నారు. చెత్తపై పన్నేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యంపైనే ఇరవై ఏళ్ల వరకు అప్పు చేశారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి సిద్ధమైపోయిందని ఆరోపించారు. రాజేంద్రపాలెం పీహెచ్‌సీని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తామని, మహిళా జూనియర్‌, డిగ్రీ కళాశాలలో సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వసతిగృహాల్లో ఆరోగ్య కార్యకర్తలను నియమిస్తామని పేర్కొన్నారు. జనసేన, భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు గంగులయ్య, కృష్ణారావులు వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జీసీసీ మాజీ ఛైర్మన్‌ ఎంవీవీ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జి.సత్యనారాయణ, జడ్పీటీసీ మాజీ సభ్యులు నళిని, శ్రీరామ్మూర్తి, తెదేపా నేతలు డి.చిట్టిబాబు, బొర్రా నాగరాజు, విజయరాణి, చల్లంగి లక్ష్మణరావు, జ్ఞానేశ్వరి, పరిశీలకులు నారాయణ, మండల అధ్యక్షులు పూర్ణచంద్రరరావు, జనసేన నాయకులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. చీడిపాలెం మాజీ సర్పంచి, వైకాపా నేత లోతా జోగిరాజు తెదేపాలో చేరడంతో ఈశ్వరి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని