logo

కుట్రలు కట్టిపెట్టు.. పింఛను సర్దిపెట్టు..

గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది వేలల్లో ఉన్నారు. వీరిని కూడా పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఒకరోజులోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 3.94 లక్షల పింఛన్లు ఇంటికే తీసుకువెళ్లి అందించడానికి అవకాశం ఉంది.

Published : 30 Apr 2024 03:25 IST

వనరులున్నాయి.. లేనిది చిత్తశుద్ధే!
ఖాతాల్లో జమచేస్తే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే

గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది వేలల్లో ఉన్నారు. వీరిని కూడా పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఒకరోజులోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 3.94 లక్షల పింఛన్లు ఇంటికే తీసుకువెళ్లి అందించడానికి అవకాశం ఉంది. పైగా వీరు వాలంటీర్లు కంటే జవాబుదారీతనంతో పనిచేస్తారు. కాబట్టి వీరిపై ఎక్కువ నమ్మకం కూడా ఉంచొచ్చు.

ఈనాడు, అనకాపల్లి న్యూస్‌టుడే, పాడేరు పట్టణం

అవ్వాతాతల పింఛన్ల పంపిణీకి సంబంధించి అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోంది. ఎన్నికల కోడ్‌ కారణంగా వాలంటీర్లను పక్కనపెట్టినప్పటి నుంచి విపక్షాలపై విషం జిమ్ముతూ ప్రచారం సాగిస్తోంది. గతనెలలో ఉద్దేశపూర్వకంగానే పింఛను సొమ్ముల విడుదలలో జాప్యం చేశారు.. ఫలితంగా అవ్వాతాతలు అవస్థలకు గురయ్యారు. మే నెలకు వచ్చేసరికి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు జమచేస్తాô, బ్యాంకులకు వెళ్లి మీ పాట్లు మీరు పడండని ఆదేశించడం మరింత విస్మయం కలిగిస్తోంది. మన్యంలో బ్యాంకులకు వెళ్లి సొమ్ములు తీసుకోవాలంటే ఒకట్రెండు రోజులు పడిగాపులు కాయాల్సిందే. వాస్తవానికి ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి పలు శాఖల ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది అవసరమైనంత మంది ఉన్నారు. వారి సేవలను ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకుంటే ఒకేరోజున అందజేయడానికి అవకాశం ఉంది. కాకపోతే పాలకులు, వారి అజెండాను మోస్తున్న ఉన్నతాధికారుల్లో ఆ చిత్తశుద్ధి కనిపించడం లేదు.

ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి వాలంటీర్లుంటేనే సాధ్యం, లేకపోతే వీలుకాదన్నట్లు ప్రభుత్వపెద్దలు భావిస్తున్నారు. వాస్తవానికి వాలంటీర్ల కంటే ముందునుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది అందుబాటులోనే ఉన్నారు. వారితో తాత్కాలికంగా ఈ రెండు నెలలు ఇంటింటికి పింఛన్లు అందించొచ్చు. వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేసే ఆశా కార్యకర్తలున్నారు. గ్రామాల్లో 250 నుంచి 300 కుటుంబాలకు ఒక ఆశా కార్యకర్త అందుబాటులో ఉంటారు. ఎన్నికలకు ముందు ఆరోగ్య సురక్ష పేరుతో ఇంటింటా సర్వేలు వీరితోనే చేయించారు. వారి పరిధిలో ప్రతి ఇంటి వివరాలు ఆశా కార్యకర్తల దగ్గర నిక్షిప్తమై ఉన్నాయి. ప్రభుత్వమిచ్చే సెల్‌ఫోన్లు వారి దగ్గర ఉన్నాయి. పింఛన్‌ సొమ్ములు వీరితో ఇంటింటికీ పంపిణీ చేయొచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు. వీరు సరిపడనంత లేదనుకుంటే ప్రతి గ్రామంలో ఒకట్రెండు అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అంగన్‌వాడీ టీచర్లను తాత్కాలికంగా పింఛన్ల పంపిణీకి ఉపయోగించుకోవచ్చు.

ఒక్కరోజులోనే అందించేయొచ్చు ఇలా..

 

  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1.27 లక్షల మంది పింఛన్లు అందుకుంటున్నారు. ఈ జిల్లాలో ఆశా కార్యకర్తలు 3,848 మంది, అంగన్‌వాడీ టీచర్లు మరో 1,791 మంది పనిచేస్తున్నారు. వీరంతా గ్రామస్థాయిలో ఏళ్ల    తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తుండడంతో ఆయా ప్రాంతాలు వీరికి కొట్టినపిండి. వీరిలో 5 వేల మందిని తాత్కాలిక పింఛన్ల పంపిణీకి ఉపయోగించుకుంటే ఒక్కొక్కరు 25 ఇళ్లకు వెళితే సరిపోతుంది. వంద శాతం పంపిణీ ఒక్కపూటలోనే పూర్తయిపోతుంది. అయితే ఆ దిశగా రాష్ట్ర ఉన్నతాధికారులు ఆలోచించి ఆదేశాలిస్తే అవ్వాతాతలు మే నెలలో ఎలాంటి ఒత్తిడి లేకుండా, గడప దాటకుండా పింఛన్‌ సొమ్ములు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. లబ్ధిదారులు కూడా అదే కోరుకుంటున్నారు.
  • అనకాపల్లి జిల్లాలో 2.66 లక్షల పింఛన్‌ లబ్ధిదారులున్నారు. వీరందరికీ ఒకరోజులోనే పింఛన్లు అందించడానికి అవసరమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 1473 మంది ఆశా కార్యకర్తలున్నారు. 1725 మంది అంగన్‌వాడీ టీచర్లున్నారు. 465 గ్రామ సచివాలయాలున్నాయి. ఒక్కో సచివాలయంలో సగటున పది మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ లెక్కన సచివాలయ సిబ్బంది 4,600 వరకు అందుబాటులో ఉన్నారు. మొత్తంగా 7,800 మంది క్షేత్ర సిబ్బంది ఉన్నారు. వీరిలో 6,500 నుంచి 7 వేల మందికి పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగిస్తే ఒక్కొక్కరి పరిధిలోకి 38 నుంచి 40 మంది లబ్ధిదారులే వస్తారు. 40 మందికి పింఛన్లు ఇంటింటికీ తీసుకువెళ్లి అందించడం పెద్ద సమస్యేమీ కాదు..
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని