logo

నాణ్యమైన విద్యకు భరోసా ఏది జగన్‌?

సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.

Published : 29 Apr 2024 04:42 IST

ఏకోపాధ్యాయ పాఠశాలలతో తీవ్ర నష్టం
ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆందోళన
ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, మాచవరం, న్యూస్‌టుడే

సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ప్రాథమిక పాఠశాలలకు కూడా ఒక ఉపాధ్యాయుడు చాలనే జగన్‌ ధోరణి విద్యా వ్యవస్థను తుంగలో తొక్కేలా ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • నూతన విద్యా విధానం అమలు నేపథ్యంలో.. జీవో నంబరు 117 తెచ్చి, పాఠశాలలను విలీనం చేయడంతో స్థానికంగా ప్రాథమిక విద్య అందని ద్రాక్షగా మారిందంటున్నారు. ముఖ్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందదనే భావన వ్యక్తమవుతోంది.
  • ప్రతి తరగతికీ ఒక ఉపాధ్యాయుడు అవసరమని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వీటిని వైకాపా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రాథమిక స్థాయిలో పాఠశాలకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడిని నియమించి చేతులు దులిపేసుకుంది.
  • ఆయా పాఠశాలల్లో తరగతులు ఎన్ని ఉన్నా.. ఒక ఉపాధ్యాయుడే అన్నీ తానై బోధన చేయాల్సి వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠాలు చెబుతూ అలసి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  • ఏకోపాధ్యాయ బడిలో ఏదైనా అవసరం ఉండి సెలవు పెట్టాల్సి వస్తే.. సమీప పాఠశాలల నుంచి మరో మాస్టారుని పంపాల్సి వస్తుంది. ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో ఎక్కడిక్కడ ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. దీంతో ఏకోపాధ్యాయులకు సెలవులు దొరక్క, క్షణం తీరిక లేక విలవిల్లాడుతున్నారు.

అర్హత గల టీచర్లున్నా..: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని విద్యార్హతలు గల (క్వాలిఫైడ్‌) ఉపాధ్యాయులు ఉంటారు. ప్రాథమిక స్థాయిలో ఏకోపాధ్యాయుడు కావడంతో చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఒక విద్యార్థి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించాలంటే.. ముందుగా దిగువ స్థాయిలో ప్రాథమిక చదువుల పునాది గట్టిగా ఉండాలనే సూచన చేస్తున్నారు. క్వాలిఫైడ్‌ టీచర్లు ఉన్న క్రమంలో.. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తే.. దిగువ స్థాయిలో విద్యార్థులకు పటిష్ఠమైన పునాది పడి.. పై తరగతులను తేలిగ్గా అభ్యసించగలరని, ఈ దిశగా ఆలోచన చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


తెదేపా కూటమి అధికారంలోకి వస్తే..

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తే.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు అవకాశం ఉంటుందని, 117 జీవో కూడా రద్దు చేసే వీలుందని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


మానసిక వ్యధ చెందుతున్నాం

-ఓ ఉపాధ్యాయురాలు

మా పాఠశాలలో 70 మంది విద్యార్థులుంటారు. అన్ని తరగతుల విద్యార్థులను చూసుకోవాలి. పాఠ్యాంశాలను బోధించడంతో పాటు ఎండీఎం, మరుగుదొడ్ల ఫొటోలు, విద్యార్థుల హాజరు వంటివి యూప్‌లో ఆప్‌లోడ్‌ చేయడం కూడా చేయాల్సి ఉంది. వీటితో మానసికంగా వ్యధ చెందుతున్నాం. అత్యవసరమైనా సెలవు దొరకని పరిస్థితి.


ఎంఈవోకు దరఖాస్తు చేయాల్సిందే

-ఓ ఉపాధ్యాయుడు

మా పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉంటారు. ఏదైనా అత్యవసరమైతేనే సెలవు పెడతాను. అటువంటి పరిస్థితుల్లో ఎంఈవో (మండల విద్యాశాఖాధికారి)కి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక్కోసారి దాన్ని కూడా తిరస్కరిస్తారు. అదే ఇతర పాఠశాలల్లో అయితే ప్రధానోపాధ్యాయుడికి సెలవు చీటి ఇస్తే సరిపోతుంది. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని