logo

అమ్మకు కష్టం.. అందని వైద్యం

వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్‌ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు.

Published : 29 Apr 2024 04:56 IST

పీహెచ్‌సీల్లో కాన్పులు ఏవీ?
కాగితాల్లోనే కార్పొరేట్‌ వైద్యం
పెడన, న్యూస్‌టుడే

వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్‌ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు.

ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ద్వారా వైద్యులు రోగుల ఇంటికి వెళ్లి సేవలు అందిస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నా గ్రామీణులు మాత్రం తమ వద్దకు వైద్యులు రావడం లేదని స్పష్టం చేస్తున్నారు. మాతా శిశు సంరక్షణలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పులు చేస్తున్నామని వైద్యులు 24గంటలు అందుబాటులో ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దామని చెబుతున్నా పీహెచ్‌సీల్లో నెలలో ఒక కాన్పు కూడా జరగడంలేదు.

అందుబాటులో ఉన్నా..

పెడన పట్టణంలో వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ అందుబాటులో ఉన్నా గర్భిణులు మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా వైద్యురాల్ని నియమించినా ఆమె ఉయ్యూరు నుంచి విధులకు రావాల్సి వస్తోంది. చేవేండ్రపాలెం పీహెచ్‌సీకి మహిళా వైద్యురాలిని నియమించినా ప్రసూతి సేవలు అందుబాటులోకి రాలేదు. ఫలితంగా గర్భిణుల్ని గుడివాడ, మచిలీపట్నం ఆస్పత్రులకు తీసుకువెళ్తున్నారు. గూడూరు మండలం మల్లవోలు పీహెచ్‌సీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కృత్తివెన్ను మండలం చినపాండ్రాక, లక్ష్మీపురం, కృత్తివెన్ను, బంటుమిల్లి, పెదతుమ్మిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతి సేవలు అందక గర్భిణులు 50 కి.మీల దూరంలో ఉన్న భీమవరం, గుడివాడ, మచిలీపట్నం వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.


ముగ్గురు స్టాఫ్‌ నర్సులు ఎక్కడ?

పీహెచ్‌సీల్లో 24గంటల వైద్యసేవలు, కాన్పుల కోసం ముగ్గురు స్టాఫ్‌ నర్సులను నియమించామని  చెబుతున్నా ఏ పీహెచ్‌సీలోనూ ముగ్గురు స్టాఫ్‌ నర్సులు కన్పించడం లేదు. పెడన అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఒక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి ఫార్మాసిస్ట్‌ను మచిలీపట్నం సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు డిప్యుటేషన్‌పై పంపించారు. ఫలితంగా విధుల్లో ఉన్న స్టాఫ్‌ నర్సు రోగులకు మందులివ్వాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. పెడన పీహెచ్‌సీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముగ్గురు స్టాఫ్‌ నర్సులు లేక గర్భిణులకు ప్రసూతి సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


నామమాత్రంగా పరీక్షలు

ప్రతి నెల 9వ తేదీన ప్రధాన మంత్రి మాతృత్వ సురక్ష యోజన కింద గర్భిణులకు ప్రభుత్వ ఆస్పతుల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. ఆ రోజు సంబంధిత మహిళా ఆరోగ్య కార్యదర్శులు, ఆశాలు గర్భిణులను ఆస్పత్రులకు తీసుకువస్తారు. ఆస్పత్రుల్లో మందుల కొరత, నిర్ధారణ పరీక్షలకు కిట్‌లు లేక అరకొర వైద్యసేవలు అందుతున్నాయి. ఫలితంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


పూర్తిస్థాయిలో అందని సేవలు

- మట్టా నాగరాజు, పెడన

ఏ ఆస్పత్రిలోనూ పూర్తిస్థాయిలో ఆరోగ్య సేవలు అందడంలేదు. 24గంటలు వైద్యసేవలు అందించాల్సి ఉండగా అది అందని ద్రాక్షగా మారింది. గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి వెళితే అక్కడ పడకలు ఖాళీ ఉండవు. కొందరు సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా బదులిస్తారు. పెడనలో ప్రసూతి సేవలు అందవు. ఈఐదేళ్లలో వైద్యరంగం పూర్తిగా వెనుకంజ వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని