logo

కదిలితే కేసు.. మెదిలితే నోటీసు

ఇలా పదే పదే గొప్పలు చెప్పిన వారి మాటలు సత్యదూరాలే అన్న విషయం కళ్లెదుటే కన్పిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో అణిచివేసే విష సంస్కృతికి తెరతీశారన్న ఆరోపణలకు ఎన్నో ఉదాహరణలున్నాయి.

Published : 29 Apr 2024 05:07 IST

ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలే లక్ష్యం
మాజీ మంత్రి కొల్లుపై ఐదేళ్ల వ్యవధిలో 25 కేసులు
అధికారపార్టీ ప్రోద్బలంతో రెచ్చిపోయిన పోలీసులు
మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే

దేవుని దయతో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలో కులం, మతం, రాజకీయాలకు తావు లేకుండా సమన్యాయం చేస్తున్నాం

-సీఎం జగన్‌


క్షక్షపూరిత రాజకీయాలకు తావే లేదు.  అందరికీ ఒకే న్యాయం.. ఒకే చట్టం

- స్థానిక ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని)

లా పదే పదే గొప్పలు చెప్పిన వారి మాటలు సత్యదూరాలే అన్న విషయం కళ్లెదుటే కన్పిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో అణిచివేసే విష సంస్కృతికి తెరతీశారన్న ఆరోపణలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. గడచిన ఎన్నికల నాటికి ఏ ఒక్క కేసు లేకుండా క్లీన్‌చిట్‌తో ఉన్న మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రపై ఐదేళ్ల కాలంలో 25 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను కట్టడి చేసేందుకు అధికార పార్టీ అక్రమ కేసులనే ఎంచుకుందన్న ఆరోపణలున్నాయి.

బెదిరింపు ధోరణే: ముఖ్యంగా తెదేపాను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో క్రియాశీలకంగా వ్యవహరించే కార్యకర్తలను తప్పుడు కేసులతో బెదిరించే వ్యూహాన్ని ఎంచుకున్నారు. సహజంగా ఇరుపక్షాల మధ్య గొడవ జరిగి ప్రతిపక్షాలకు చెందిన వారు బాధితులుగా ఉన్నా వారిపైనే కేసులు నమోదైన సంఘటనలున్నాయి. బందరు మండల పరిధిలోని కరగ్రహారంలో ఓ దాడి విషయంలో తెదేపాకు చెందిన ధనుష్‌ అనే వ్యక్తిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసే పరిస్థితి ఎదురయ్యింది. పోతేపల్లిలో వైకాపా ఫ్లెక్సీ చింపాడన్న అనుమానంతో యశ్వంత్‌ అనే అతనిపై దాడి చేసి గాయపర్చడమే కాకుండా అతనిపైనే పోలీసులు కేసు పెట్టారు. బుద్ధాలపాలెంలో తెదేపాలో కీలకంగా వ్యవహరించే కార్యకర్తపై ఫిర్యాదు వచ్చిందన్న సాకుతో స్టేషన్‌కు పిలిపించిన నాటి నుంచి అతను పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యాడు. పెదయాదర గ్రామంలో జనసేనకు అనుకూలంగా వ్యవహరించాడనే కారణంతో ఓ యువకునిపై దాడి చేయడంతో అతను మృతి చెందగా బాధిత కుటుంబానికి న్యాయం దక్కలేదు. కోన, కరగ్రహారం, సుల్తానగరం, తదితర గ్రామాల పరిధిలో దాడుల బారిన పడిన తెదేపా కార్యకర్తలపై ఎదురు కేసులు పెడతామంటూ బాహాటంగానే బెదిరింపులకు పాల్పడ్డారు.

అనుకూలురైన వారిపై చర్యలుండవు: అధికార పార్టీ అండతో అరాచకాలు చేసే మూకలపై కేసులు నమోదు కాకపోవడంపై బాధితుల ఆక్రోశం అరణ్యరోదనే అవుతోంది. అధికార పార్టీ ముసుగులో కొన్నాళ్లుగా గంజాయి బ్యాచ్‌లు చేసే అరాచకాలు శృతి మించుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. వైకాపాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అందులో ఇమడలేక జనసేనలో చేరిన కొరియర్‌ శ్రీను కార్యాలయాన్ని ధ్వంసం చేసి, ఫ్లెక్సీలను తగలబెట్టి, వాచ్‌మైన్‌పై దాడి చేసినా ఎటువంటి చర్యలు లేవు. ఇటీవలే ఓ కేసులో నిందితులుగా ఉన్న వైకాపా కార్యకర్తలను విచారణ నిమిత్తం పిలిపించారన్న కారణంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా వందలాది మందితో తాలూకా స్టేషన్‌కు వచ్చి పోలీస్‌ అధికారులను దుర్భాషలాడుతూ, ఫర్నిచర్‌ ధ్వంసం చేసినా అసలు బాధ్యులపై చర్యలు లేవు.


కొల్లు రవీంద్రే లక్ష్యంగా..

ఎంతో సౌమ్యుడిగా పేరున్న కొల్లు రవీంద్రనే లక్ష్యంగా చేసుకుని ఐదేళ్ల వైకాపా పాలనలో దాదాపు 25 కేసులు నమోదు చేశారు. హత్యకు కుట్ర చేశారన్న కారణంతో మచిలీపట్నంలో, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంతో తాడేపల్లిలో కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ సమయంలో ఎటువంటి అధికారిక హోదా లేకపోయినా పేర్ని నాని కుమారుడు కిట్టూ కొవిడ్‌ నిబంధనలకు తిలోదకాలిచ్చి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినా పట్టించుకోని పోలీసులు మాజీ మంత్రి హోదాలో బాధితులను పరామర్శించినందుకు వెళ్లిన కొల్లుపై కొవిడ్‌ ఉల్లంఘన పేరుతో పెడన, ఇనగుదురుపేటల్లో, సర్వే రాళ్లను విధ్వసం చేశారంటూ తాలూకా స్టేషన్‌లో కేసులు పెట్టారు. ఇవే కాకుండా వివిధ కారణాలతో వేర్వేరు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.


వ్యవస్థలను శాసిస్తున్నారు

- ఐ.దిలీప్‌కుమార్‌, కొబ్బరితోట

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను హస్తగతం చేసుకున్నారు. చట్టాలతో పనిలేకుండా అధికారులు, పోలీసులు వైకాపా నాయకుల ఆదేశాలే పాటిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెందిన వారి   ఆర్థ్ధికమూలాలు దెబ్బకొట్టేందుకు అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమచర్యలకు పాల్పడుతున్నారు.


వైకాపావి కుటిల రాజకీయాలు

- గడ్డం రాజు, జనసేన నాయకుడు

వైకాపా కుటిల రాజకీయాలతో మాపార్టీ జెండా దిమ్మలు కూల్చేసి మాపైనే అక్రమ కేసులు పెట్టించారు. ఎదుటి వారిని అణగదొక్కడానికి కదిలితే కేసు... మెదిలితే కేసు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ వారు ఎంత నేరం చేసినా కన్నెత్తి చూసే పరిస్థితి లేకపోగా ప్రతిపక్షాల నాయకులను భయపెట్టే విధంగా పోలీసులు అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. గంజాయి బ్యాచ్‌తో అరాచకాలు సృష్టిస్తున్నా వారిని నియంత్రిచే పరిస్థితులు లేకుండా పోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని