logo

వైకాపా నాయకుడి బరితెగింపు

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లుంది అధికార వైకాపా నాయకుల తీరు. పార్టీ పెద్దలు పంచభూతాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటే.. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు తామేం తక్కువన్నట్లు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములే లక్ష్యంగా చేసుకుని ఆదాయ వనరులు పెంచుకుంటున్నారు.

Published : 28 Apr 2024 03:53 IST

ప్రభుత్వ భూమి ఆక్రమించి మామిడి సాగు 

ప్రభుత్వ భూమి ఆక్రమించి నాటిన మామిడి చెట్లు

కదిరి పట్టణం, తనకల్లు, న్యూస్‌టుడే: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లుంది అధికార వైకాపా నాయకుల తీరు. పార్టీ పెద్దలు పంచభూతాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటే.. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు తామేం తక్కువన్నట్లు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములే లక్ష్యంగా చేసుకుని ఆదాయ వనరులు పెంచుకుంటున్నారు.  కదిరి నియోజకవర్గం, తనకల్లు మండలంలోని సీజీ ప్రాజెక్టు గ్రామానికి చెందిన వైకాపా గ్రామస్థాయి నాయకుడు ఏకంగా రెండెకరాల భూమిని ఆక్రమించుకుని దర్జాగా 110 మామిడిచెట్లు నాటేశాడు. ఈ విషయాన్ని స్థానికులు ఫిర్యాదు చేసినా.. వైకాపా నాయకుల హెచ్చరికలతో రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోయారు. కోటపల్లి రెవెన్యూ గ్రామం సర్వేనంబరు 85లో 44.74 ఎకరాల భూమి వాగు పరివాహక ప్రాంతంగా రికార్డులో ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి వాగుగా ఉంది. మహమ్మదాబాద్‌ క్రాస్‌ నుంచి కొక్కంటిక్రాస్‌ వరకు రోడ్డు వేస్తున్న సమయంలో అధికారపార్టీ నాయకుల ఆదేశాలతో గుత్తేదారు వాగు పరివాహక ప్రాంతంలోని మట్టిని ఇష్టానుసారం తవ్వేశారు. మట్టి తరలింపు, భూమి స్వభావంపై రెవెన్యూ, మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. మట్టి తవ్వేయడంతో రెండు ఎకరాలకు పైగా భూమి చదునుగా మారింది. దీన్ని గమనించిన సీజీ ప్రాజెక్టుకు చెందిన వైకాపా గ్రామస్థాయి నాయకుడు సాగుకు అనుకూలంగా మార్చేసుకుని మామిడిచెట్లు నాటాడు. అంతేకాదు.. వాటికి నీరందించేందుకు చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్టు నుంచి అక్రమంగా పైపులు ఏర్పాటు చేసుకుని నీటి చౌర్యానికి పాల్పడుతున్నాడు. స్థానికులు ఫిర్యాదు చేసినా నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. సదరు నాయకుడు ఆక్రమించిన భూమి ఎకరా రూ.40 లక్షలు పలుకుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని