logo

పొడిబారిన దారులు

తిరుపతి కరకంబాడి మార్గంలో భూపాల్‌ లేఔట్‌ సమీపంలో నాలుగు నెలల కిందట సిమెంట్‌ రోడ్డు నిర్మించారు. కొద్ది రోజులకు కురిసిన వర్షాలకు పొరలు పొరలుగా లేస్తోంది.

Updated : 31 Mar 2023 04:38 IST

తిరునగరిలో ఇసుక రహిత సిమెంట్‌ రోడ్ల నిర్మాణం
న్యూస్‌టుడే, తిరుపతి (నగరపాలిక)

తిరుపతి కరకంబాడి మార్గంలో భూపాల్‌ లేఔట్‌ సమీపంలో నాలుగు నెలల కిందట సిమెంట్‌ రోడ్డు నిర్మించారు. కొద్ది రోజులకు కురిసిన వర్షాలకు పొరలు పొరలుగా లేస్తోంది. తమ విజ్ఞప్తి మేరకే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతో రోడ్డు దుస్థితిపై ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డికి స్థానికులు ఫిర్యాదు చేయలేకపోతున్నారు.

.. ఈ ఒక్క రోడ్డే కాదు.. నగరంలో ఎమ్మార్‌పల్లి, జీవకోన, లక్ష్మీపురం పరిసర ప్రాంతం, యశోదనగర్‌, యాదవకాలనీ, భవానీ నగర్‌ తదితర ప్రాంతాల్లో వేసిన రోడ్లన్నీ కొద్దినెలలకే దెబ్బతిన్నాయి.
 

కరకంబాడి రోడ్డులో నిర్మాణానికి నిల్వ చేసిన రాతిపొడి

గరపాలిక సాధారణ నిధుల నుంచి కాలువలు, సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.61 కోట్లు మంజూరు చేసేందుకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. కొన్ని పనులు పూర్తి కాగా.. మరికొన్ని సాగుతున్నాయి. కొన్నింటికీ ఇంకా టెండర్లు పిలవలేదు. ఇప్పటి వరకు చేసిన పనులు, ప్రస్తుతం చేస్తున్న పనుల్లో నాణ్యతకు పాతర వేస్తున్నారు.

ఎలా ఏమార్చుతున్నారంటే..  

సిమెంట్‌ రోడ్లు, మురుగునీటి, వర్షపునీటి కాలువలు, వంతెల నిర్మాణ సమయంలో ఇసుక, కంకర, సిమెంట్‌ కలిపిన కాంక్రీట్‌ను వాడాలి. ఇసుక ధర ఎక్కువగా ఉండటంతో గుత్తేదారులకు గిట్టుబాటు కాదనే సానుభూతితో 50 శాతం వరకు రాతి పొడిని వాడేందుకు అనుమతిస్తున్నారు. తిరుపతి పరిసరాల్లో లభించే రాతిపొడి సైతం నున్నగా ఉండటంతో ఇంజినీరింగ్‌ అధికారులు పరిశీలించి పొడి గరుకుగా ఉంటేనే అనుమతించేలా నిబంధనలు విధించారు. దీనిని ఆసరాగా చేసుకుని గుత్తేదారులు పూర్తిగా రాతి పొడిని వినియోగించి కాంక్రీటు పనులు చేస్తున్నారు. ప్రజల్ని ఏమార్చేందుకు పనులు జరిగే ప్రాంతంలో కొద్ది పరిమాణంలో ఇసుకను నిల్వ చేసుకుని నగరపాలిక అధికారులు, సిబ్బంది కాకుండా ఇతరులెవరైనా వస్తే కొద్దిగా ఇసుక చల్లి కాంక్రీటు కలుపుతున్నారు. లేదంటే యథావిధిగా రాతిపొడి కాంక్రీటు కుమ్మరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

గొల్లవానిగుంటలోరహదారి దుస్థితి

గుత్తేదారులదే రాజ్యం

నగరపాలిక సాధారణ నిధులతో చిన్నచిన్న పనులుగా విభజించి చేస్తున్న ఈ నిర్మాణాలకు అధికారులు అభ్యంతరాలు లేకుండా బిల్లులు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికితోడు గుత్తేదారులను ప్రశ్నించే వ్యవస్థ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారనే విమర్శలున్నాయి. పనులు అప్పగించడం, పూర్తయిన తరువాత బిల్లులు మంజూరు చేయడం వరకే అధికారులు పరిమితమయ్యారు.

ఈ విషయమై నగరపాలిక ఏసీఈ మోహన్‌ను వివరణ కోరగా.. పనులను ఇంజినీరింగ్‌ అధికారులు స్వయంగా పరిశీలించి ఇసుకను కచ్చితంగా వాడేలా  ఆదేశిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని