logo

చీటీల మోసం కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు

చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం స్థానిక జిల్లా ప్రధాన సెషన్స్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భీమారావు సోమవారం తీర్పు చెప్పారు.

Updated : 30 Apr 2024 06:24 IST

పోలీసులతో ముద్దాయి ఆంజినేయులు

చిత్తూరు(న్యాయవిభాగం): చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం స్థానిక జిల్లా ప్రధాన సెషన్స్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భీమారావు సోమవారం తీర్పు చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పులికల్లు రవీంద్రారెడ్డి కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన ఆంజినేయులు అలియాస్‌ సాయినాథ్‌ చౌదరి(47) బంగారుపాళ్యంలోని నెహ్రూవీధిలో ఉంటూ ఓంశక్తి ఆలయ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. నాలుగేళ్లుగా ఓంశక్తి మాల ధరించి ఇంటి వద్ద చీటీలు నిర్వహిస్తూ రూ.5 లక్షల నుంచి రూ.2 లక్షల చీటీలతో పాటు.. అధిక వడ్డీ ఆశ చూపి కొందరి నుంచి వసూలు చేసి వడ్డీ వ్యాపారం చేపట్టాడు. సకాలంలో చీటీ, వడ్డీ డబ్బులు చెల్లిస్తూ నమ్మించాడు. దీంతో చాలామంది చీటీలు వేశారు. 2022 ఫిబ్రవరి 21న అతడు రాత్రికిరాత్రే ఇల్లు ఖాళీ చేసి బంగారుపాళ్యం నుంచి వెళ్లిపోయాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అతడిని అదే నెల 23న అరెస్టు చేశారు. 64 మందికి రూ.6.4 కోట్లు అందజేయకుండా మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలడంతో అతడిని కోర్టులో హాజరుపరిచారు. పూర్వపరాలను పరిశీలించిన పిదప నేరం రుజువు కావడంతో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలుశిక్ష, రూ.1.55 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కేసు విచారణలో కోర్టు లైజినింగ్‌ అధికారిగా చిరంజీవి, కోర్టు కానిస్టేబుల్‌గా సురేంద్రబాబు వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని