logo

తిరుమల పవిత్రతను మంటగలిపారు

శ్రీవారి దర్శనం టికెట్ల ధరను విపరీతంగా పెంచేసి తిరుమలకు వచ్చే భక్తులను గత ఐదేళ్లలో దోచుకున్నారని ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు.

Published : 30 Apr 2024 02:44 IST

ధరలు పెంచి భక్తులను దోచుకున్నారు : ఆరణి

ఆరణి శ్రీనివాసులుతో కలిసి పాల్గొన్న పనబాక లక్ష్మి, నరసింహయాదవ్‌, సుగుణమ్మ, శ్రీధర్‌వర్మ, జేబీ శ్రీనివాస్‌, కోడూరు బాలసుబ్రమణ్యం, రాజుయాదవ్‌ తదితరులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనం టికెట్ల ధరను విపరీతంగా పెంచేసి తిరుమలకు వచ్చే భక్తులను గత ఐదేళ్లలో దోచుకున్నారని ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. తిరుమల నిబంధనల మేరకు పార్టీ చిహ్నాలు, కండువాలు లేకుండా ప్రచారం నిర్వహించారు. సోమవారం తెదేపా తిరుమల విభాగం అధ్యక్షుడు రాజుయాదవ్‌ ఆధ్వర్యంలో కూటమి తరఫున నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైనచోట ఆయన పేరుతో తాను పోటీచేయడం సంతోషంగా ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో తిరుమలను కలుషితం చేసిందని ఆరోపించారు. రూ.10వేల శ్రీవాణి, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లతో భక్తులను దోచుకున్నారని విమర్శించారు. తెదేపా అధికారంలోకి రాగానే భక్తుల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. తిరుపతి, తిరుమలలోని స్థానికులకు ప్రతి మంగళవారం దర్శన భాగ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ.. వైకాపా పాలనలో తిరుపతి ప్రజలను మోసగించారని, తితిదే ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి తన కుమారుడు అభినయ్‌రెడ్డిని గెలిపించుకునేందుకు తితిదే బడ్జెట్‌ నుంచి రూ.1500 కోట్ల టెండర్లు హడావుడిగా కట్టబెట్టి పెద్దఎత్తున వాటాలు దండుకున్నారని ఆరోపించారు. తిరుమలలో అనధికార దుకాణాలపై విచారణచేసి స్థానికులకు న్యాయం చేస్తామన్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారాన్ని ఆపేయాలని ప్రభుత్వ ఎన్నికల పర్యవేక్షకులు తెలపడంతో తిరుమల పోలీసులు ప్రచారాన్ని ఆపేయాలని కూటమి అభ్యర్థిని కోరారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కిరణ్‌ రాయల్‌ పోలీసులతో మాట్లాడుతూ.. ముందస్తు సమాచారం తమకు అందలేదని, ఇచ్చుంటే బాగుండేదని పోలీసులతో పేర్కొన్నారు. దీంతో ప్రచారాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి వెనుతిరిగారు. మాజీమంత్రి పనబాకలక్ష్మి, నాయకులు నరసింహయాదవ్‌, శ్రీధర్‌వర్మ, ఊకా విజయ్‌కుమార్‌, జేబీ శ్రీనివాస్‌, కోడూరు బాలసుబ్రమణ్యం, సింగంశెట్టి సుబ్బరామయ్య, తిరుమల తెలుగు యువత అధ్యక్షులు రాఘవ, జనసేన నాయకులు, భాజపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు