logo

ఓటుకొస్తే అమ్మ.. జీతాలకొస్తే ఆ..యమ్మ

కాలే కడుపులు.. అర్ధాకలితో ఉన్నా తమకు అప్పజెప్పిన పనులు పూర్తిచేయడంలో ఆయాలు ముందుంటారనడంలో సందేహం లేదు.

Published : 30 Apr 2024 02:45 IST

ప్రభుత్వ పాఠశాలల్లో జీతాలందక ఆకలికేకలు
నాలుగు మాసాలుగా ఎదురుచూపులు

కాలే కడుపులు.. అర్ధాకలితో ఉన్నా తమకు అప్పజెప్పిన పనులు పూర్తిచేయడంలో ఆయాలు ముందుంటారనడంలో సందేహం లేదు. రోజూ ఆయా పాఠశాలకు అందరికంటే ముందుగా వెళ్లి.. ఆవరణలతోపాటు గదులు శుభ్రంచేసి విద్యార్థులు వచ్చే వచ్చేసరికి అందంగా తీర్చిదిద్దేవారు వారే. చిన్నపిల్లలు మలమూత్ర విసర్జనలు చేసిన సమయాల్లో వారి పాత్ర కన్నతల్లులను మైమరిపిస్తుంది. మధ్యాహ్నం భోజనాలు వడ్డించే సమయంలోనూ తోడుగా ఉండే వారి బతుకులు జగనన్న ప్రభుత్వ పుణ్యమా అంటూ దీనవస్థలో ఉన్నాయి. 30 రోజులపాటు వెట్టిచాకిరీ చేసినా ప్రభుత్వం వారికి చెల్లించేది రూ.6,000 మాత్రమే. అంటే రోజుకు రూ.200. ప్రస్తుతం రోజువారీ కూలీ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.385 నిర్ణయించగా వీరిరెక్కల కష్టం మాత్రం గుర్తించకపోగా.. ఆ చెల్లించే అరకొర వేతనం నెలల తరబడి ఇవ్వకపోవడంతో ఆయా కుటుంబాల్లో ఆవేదన నిండుకుంది.

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: పాఠశాలల నిర్వహణ పేరుతో అమ్మఒడి నుంచి రూ.2వేలు చొప్పున ప్రభుత్వం మినహాయిస్తోంది. విద్యార్థులకు చెల్లించే రూ.15వేలలో ఈ మొత్తం మినహాయించి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఆయాలకు టీఎంఎఫ్‌ (టాయిలెట్‌ మెయింటినెన్స్‌ ఫండ్‌) కింద జీతాలుగా చెల్లిస్తున్నారు. అమ్మఒడి డబ్బులు ఆయా విద్యార్థుల తల్లుల ఖాతాలకు ఈ ఏడాది ప్రభుత్వం అరకొరగా జమచేసినా ఆయాలకు మాత్రం ఆ ఊసేలేదు. జిల్లా వ్యాప్తంగా 2,294 ప్రభుత్వ పాఠశాలల్లో 2,416 మందికి పైగా ఆయాలున్నట్లు సమాచారం. తిరుపతి నగరపాలకసంస్థ పరిధిలోని 77 పాఠశాలల్లో 102 మంది ఉన్నారు. వీరికి ప్రతి మాసం జీతాలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు జమ చేయకపోవడంపై ఆయాల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదేరీతిలో ఆయా పురపాలక పాఠశాలల్లో జీతాలు చెల్లించలేదని తెలిసింది.

సంఘాలున్నా వృథా: కృష్ణవేణి

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఆయాలకు ఓ సంఘం ప్రత్యేకంగా ఉంది. ప్రతి మాసం తమ జీతం నుంచి రూ.100-200 సభ్యత్వం కింద తీసుకుంటున్నారు. ఈ విధంగా జిల్లాలోని 2,416 మంది చెల్లిస్తున్నాం. నాలుగు మాసాలు గడుస్తున్నా ఇంతవరకు సంఘం నేతలు నోరుమెదపకపోవడం దారుణం.

అర్ధాకలితో అలమటిస్తున్నాం : మమత

ప్రభుత్వ పాఠశాలలో పదేళ్లుపైగా పనిచేస్తున్నా. ఉపాధ్యాయులకు ఆలస్యంగానైనా ఇస్తున్నారు. మాకు నెలలతరబడి ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. కుటుంబం రూ.6 వేలుపైనే ఆధారపడి జీవిస్తోంది. అదీ సకాలంలో రాకపోవడంతో ఒక పూట తిండితో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని