logo

పింఛను పంచన.. నయా వంచన

సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్‌, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు.

Updated : 30 Apr 2024 06:21 IST

వృద్ధులపై వైకాపా ప్రభుత్వ కక్ష
సచివాలయాల కంటే బ్యాంకులే దూరం
ఖాతాల్లో వేస్తామంటూ లబ్ధిదారులతో చెలగాటం

సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్‌, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన పింఛన్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసి వృద్ధులను మూడు-నాలుగు కిలోమీటర్లు నడిపించిన ఉదంతం తెలిసిందే. ఇది మరువక ముందే మే నెల పింఛను నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అక్కడకే వెళ్లి తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నడి ఎండలో వృద్ధులు అంతదూరం ఎలా వెళ్లగలరనే ప్రశ్నలు వస్తున్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వైకాపా సర్కార్‌ వ్యవహరిస్తోంది. సచివాలయాల్లో సరిపడా సిబ్బంది ఉన్నా ఇలా చేయడమేంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

ఈనాడు, చిత్తూరు- న్యూస్‌టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ): జిల్లాలోని సచివాలయాల్లో పింఛన్ల పంపిణీకి అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉన్నా గత నెలలోలాగా యాతనకు గురిచేసేందుకు జగన్‌ ప్రభుత్వం చూడటం దారుణమని లబ్ధిదారులు వాపోతున్నారు. గత నెల ఎండలకు ఇబ్బందిపడ్డారని.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై వేసిన ప్రభుత్వం.. గతంలో కంటే మూడు నాలుగు రెట్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వెళ్లి ఎలా తీసుకోవాలని ఉత్తర్వులు ఎలా ఇస్తారని పింఛనుదారులు ప్రశ్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులతో పెన్షన్లు ఇప్పించడానికి అవకాశమున్నా.. తమను అవస్థల పాల్జేసి రాజకీయ లబ్ధి పొందడమే ధ్యేయంగా వైకాపా సర్కార్‌ వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.

రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశమున్నా..

ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం సచివాలయ సిబ్బందికి పెద్దగా పనులు అప్పగించలేదు. వీరికి ఈ బాధ్యత అప్పగిస్తే ఒక్కో సిబ్బంది 31 మందికి నగదు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అందరికీ కలిపి కనిష్ఠంగా ఒక్క రోజు.. గరిష్ఠంగా రెండు రోజుల్లో నగదు ఇవ్వవచ్చు. ఈ మేరకు ఆదేశిస్తే బాగుంటుందని ప్రతిపక్షాలు, వృద్ధుల నుంచి సీఎస్‌ జవహర్‌రెడ్డికి డిమాండ్లు వచ్చినా బేఖాతరు చేశారు.

గుడుపల్లెలో బ్యాంకులు రెండు.. పింఛనర్లు 4,060 మంది

గుడుపల్లె మండలంలో రెండు బ్యాంకులున్నాయి. ఇవి రెండూ పీఈఎస్‌ కళాశాల, ద్రవిడ విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బంది సేవలు అందించడానికే కష్టంగా ఉంటోంది. మండలంలోని 4,060 మంది పింఛనుదారులు ఇక్కడ క్యూ కట్టే అవకాశం ఉంది. 8 కి.మీ. దూరంలోని పెద్దపర్తికుంట నుంచి వృద్ధులు వచ్చి పింఛను తీసుకోవడం కష్టమే.

ఖాతాదారులకే కష్టాలు..

కల్లూరు ఇండియన్‌ బ్యాంకులో  సిబ్బంది కొరతతో ఖాతాదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి.  ఇక పింఛను లబ్ధిదారులు వస్తే అక్కడి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

  • పాలసముద్రంలోనూ ఒకే బ్యాంకు శాఖ ఉండగా 2,833 మంది పింఛనుదారులున్నారు. ఒకేరోజు ఎండలో ఇంతమంది  బ్యాంకు వద్దకు నడుచుకుంటూ, వాహనాల్లో రాగలరా? వచ్చినా అక్కడ సదుపాయాలు లేవని తెలిసినా ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు.
  • పూతలపట్టు నియోజకవర్గంలో 31,060 మంది బ్యాంకులకు వచ్చి పించను తీసుకోవాలి. ఇక్కడ 40 బ్యాంకు శాఖలే ఉన్నాయి. ఐరాల మండలంలోని 12 బ్యాంకులలో సగం కాణిపాకంలోనే ఏర్పాటు చేశారు. ఇందులో  దేవస్థాన లావాదేవీలే అధికంగా జరుగుతాయి.
  • గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని 26 బ్యాంకుల నుంచి 31,058 మంది పెన్షన్‌ నగదు ఉపసంహరించుకోవాలి. ఇది ఆచరణలో కష్టం.
  • నిండ్ర మండలం ఇరుగువాయి పంచాయతీ నుంచి బ్యాంకులకు చేరుకోవాలంటే ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని నిండ్ర లేదా నగరికి వెళ్లాలి. యాదమరి, పుంగనూరు మండలంలోని పలు గ్రామాలకు బ్యాంకులు  7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జిల్లాలో ఇలాంటి గ్రామాలు అనేకం ఉన్నాయి.

నా పేరు లక్ష్మమ్మ. గుడుపల్లె మండలం ఇరిసిగానిపల్లి. వితంతు పింఛను వస్తోంది. కుప్పం పట్టణంలోని ఓ బ్యాంకులో ఖాతా ఉంది. మా ఊరి నుంచి కుప్పానికి వెళ్లాలంటే 10 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇరిసిగానిపల్లి నుంచి గుడుపల్లె మండల కేంద్రానికి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. అక్కడి నుంచి కుప్పం పట్టణానికి బస్సు లేదంటే ఆటోలో ప్రయాణించాలి. రానుపోనూ ఛార్జీ రూ.40. భోజన, ఇతర ఖర్చులు కలిపి రూ.150 వరకు అవుతుంది. మొత్తంగా రూ.200 వరకు వెచ్చించాలి. అదీ వెళ్లిన రోజే పింఛన్‌ ఇస్తేనే. ప్రభుత్వం స్పందించి సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు ఇవ్వాలి.


ఇబ్బంది పడతాం

ఈ నెలలో ఎండల్లో సచివాలయానికి వెళ్తే డబ్బులు రాలేదు. రేపు రావాలని చెప్పారు. మరుసటి రోజు వెళ్లి మధ్యాహ్నం వరకూ ఉండి పింఛను తెచ్చుకున్నాం. ఎండల్లో చాలా ఇబ్బంది కలిగింది. కాలికి దెబ్బ తగిలి నడవలేను. గతంలోలా ఇంటి వద్దే ఇవ్వాలి. మరోసారి ఇబ్బంది తప్పదు.

రాజమ్మ, ఎల్‌.బి.పురం, చిత్తూరు గ్రామీణ


గ్రామంలోనే  ఇవ్వాలి

సచివాలయాల్లో పింఛను ఇచ్చినా, బ్యాంకు ఖాతాలకు జమ చేసినా వెళ్లి లైన్లో నిలుచుని తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడాలి. కనీసం ఇంటి వద్ద కాకున్నా గతంలోలా గ్రామంలో ఒకచోట ఇచ్చినా వెళ్లి తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండదు.

కళావతి, వేపనపల్లి, పూతలపట్టు


నెలకో విధానం దారుణం

పింఛను పంపిణీకి నెలకో విధానం అమలు చేస్తే వృద్ధులు, దివ్యాంగులు అయోమయానికి గురై ఇబ్బంది పడతారు.  ఇస్తే ఇంటి వద్ద లేకుంటే గ్రామంలోనే ఒక చోట పంపిణీ చేస్తే సమయానికి వెళ్లి పింఛను తెచ్చుకుంటాం.

వెంకటముని, దివ్యాంగుడు, రెడ్లపల్లి, శాంతిపురం

జిల్లాలో బ్యాంకులు:  244
మొత్తం పింఛన్లు :  2,72,864
బ్యాంకు ఖాతా లేనివారు: 80,843
జిల్లాలో సచివాలయాలు: 612
సచివాలయ సిబ్బంది: 8,800
ఒక్కొక్కరు పంపిణీ చేసే అవకాశమున్న పింఛన్లు: 31

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని