logo

యువకుడి ఆత్మహత్యతో పెళ్లింట విషాదం

రెండు రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. వివాహ పనుల నిమిత్తం కుటుంబికులు బయటకెళ్లి వచ్చేసరికి పెళ్లి కుమారుడు ఇంట్లో ఉరేసుకుని కొన ఊపిరితో ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

Published : 03 Feb 2023 06:16 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు: రెండు రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. వివాహ పనుల నిమిత్తం కుటుంబికులు బయటకెళ్లి వచ్చేసరికి పెళ్లి కుమారుడు ఇంట్లో ఉరేసుకుని కొన ఊపిరితో ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కుమారుడ్ని తీసుకుని ఆ తల్లి ఆసుపత్రులు చుట్టు తిరిగినా ఫలితం దక్కలేదు. వివాహం కావాల్సిన యువకుడు విగతజీవిగా మారిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. బొమ్మూరు స్టేషన్‌ సీఐ ఆర్‌.విజయ్‌కుమార్‌ వివరాల మేరకు... బొరుసు రాజీవ్‌బాబు(32) నగరంలోని దానవాయిపేటలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి గతంలోనే మరణించారు. ముగ్గురు సోదరీమణులకు వివాహాలయ్యాయి. తల్లి మంగాదేవితో కలసి బాలాజీపేటలోని ఓ అపార్టుమెంటులో రాజీవ్‌బాబు ఉంటున్నారు. పెళ్లి పనుల నిమిత్తం సోదరీమణులు, తల్లి బయటకు వెళ్లే క్రమంలో రాజీవ్‌ తనకు పనిఉందని చెప్పి ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోయాడు. బయటకు వెళ్లినవారు రెండు గంటల్లో తిరిగి వచ్చేసరికి రాజీవ్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు.


ఆర్ట్స్‌ కళాశాలల ప్రిన్సిపల్‌ భార్య బలవన్మరణం

రాజమహేంద్రవరం నేరవార్తలు: భర్త, ఒక్కగానొక్క కుమారుడు ఉద్యోగ విధుల్లో బిజీగా ఉండడంతో ఇంట్లో ఆమె ఒంటరిగా భావించారు. మానసిక ఒత్తిడి భరించలేని ఆ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజమహేంద్రవరం నగరంలో చోటుచేసుకుంది. ప్రకాశంనగర్‌ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి వివరాల మేరకు.. నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో నివాసముంటున్న చప్పిడి కృష్ణ డిగ్రీ కళాశాలలు(జోన్‌1) ఆర్‌జేడీగా, రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య రమాదేవి(57), ఓ కుమారుడు. అమెరికాలో స్థిరపడ్డ కుమారుడికి ఈ నెల 10న వివాహం జరగాల్సి ఉంది. వారం కిందటే అతను నగరానికి వచ్చాడు. పెళ్లైన వారం తర్వాత అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. విధి నిర్వహణ నిమిత్తం మరో జిల్లాలో ఉన్న కృష్ణ బుధవారం మధ్యాహ్నం పలుమార్లు రమాదేవికి ఫోన్‌ చేశారు. ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో సాయంత్రం ఇంటికి వచ్చి చూశారు. అప్పటికే భార్య రమాదేవి గదిలో ఫ్యానుకు వేలాడుతుండడంతో కుమారుడ్ని పిలిపించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని