logo

జగనన్నా.. ఇదేనా ‘మీ సేవ’..!

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 215 మీసేవ కేంద్రాలు ఉండేవి.

Published : 28 Apr 2024 03:56 IST

వెలవెలబోతున్న మీసేవ కేంద్రం

న్యూస్‌టుడే, ముమ్మిడివరం: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 215 మీసేవ కేంద్రాలు ఉండేవి. వైకాపా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి.. మీసేవ కేంద్రాలకు కత్తెర వేసింది. సేవలన్నీ గ్రామ సచివాలయాల్లోనే పొందాలనే విధంగా ప్రచారం చేసి మీసేవ కేంద్రాలు మూతపడే స్థితికి తీసుకువచ్చారు. ఓ దశలో మీసేవ కేంద్రాల్లో పొందిన ధ్రువపత్రాలు పనిచేయవనేలా వ్యవహరించిన పరిస్థితులున్నాయి.

గతమే మేలు..

పౌరసేవలన్నింటినీ సులభతరం చేయాలి. ఆలస్యం కాకుండా.. అవినీతి అక్రమాలకు తావు లేకుండా.. ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మీసేవ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు నిర్ణీత రుసుం చెల్లించి తమకు కావాల్సిన సేవలు నిర్ణీత గడువులో సులువుగా, సులభతరంగా పొందేవారు.

యువత రోడ్డుపాలు..

జగనన్న ఏలుబడిలో ఇప్పడు మీసేవ కేంద్రాలు మూతపడుతున్నాయి. కేంద్రాలను నిర్వహించలేక నిర్వాహకులు అప్పుల పాలవుతున్నారు. పొమ్మనలేక పొగపెట్టినట్లుగా సేవల్లో కోత విధించి కేంద్రాలను దెబ్బతీశారు. మీసేవ కేంద్రాల ద్వారా ఉపాధి పొందుతున్న యువత వాటిని మూసేసి ఇతర పనులకు వెళ్లాల్సిన దుస్థితికి తీసుకువచ్చారు.

ప్రాధాన్యం తగ్గించేసి..

మీసేవ కేంద్రాల్లో గతంలో అత్యంత ప్రాధాన్యమైన మ్యుటేషన్లు, ఆధార్‌, రేషనుకార్డుల్లో చేర్పులు, సవరణలు, కొత్తవాటికి దరఖాస్తు చేసుకోవడం, అడంగళ్‌లో దిద్దుబాట్లు, ఓటర్ల నమోదు, గుర్తింపుకార్డుల జారీ వంటి 300 రకాల సేవలు అందేవి. వీటిలో ప్రధాన సేవలన్నింటినీ సచివాలయాలకు అప్పగించడంతో మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. నెలకు నిర్దేశిత సేవలు అందించాలని మెలికపెట్టి ఆ మేరకు సేవలందించకపోతే రద్దు చేస్తున్నారు. అప్పు చేసి, రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన సామగ్రి వృథాగా మారాయని వారు వాపోతున్నారు. జిల్లాలో సుమారు 120 వరకు మీసేవ కేంద్రాలు మూతపడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మీసేవ కేంద్రాలకు ఎప్పుడు వీలుంటే.. అప్పుడు వెళ్లి కావాల్సిన సేవలు పొందే అవకాశం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. పోనీ సచివాలయాల్లో పూర్తిస్థాయి సేవలందిస్తున్నారా.. అంటే అదీ లేదు. విద్యుత్తు లేకున్నా, అంతర్జాలం పనిచేయకపోయినా, ఇతర ఆటంకాలు ఎదురైనా ఇక అంతే.

ఇదివరకు నెలకు రూ.20 వేలు వచ్చేది..

మీసేవ కేంద్ర]ం ఏర్పాటుతో ఉపాధి లభించిందని ఆనందపడ్డా. రూ.లక్షలు ఖర్చుచేసి కంప్యూటర్‌, ప్రింటర్‌, ఇతర పరికరాలు ఏర్పాటు చేసుకున్నా. కేంద్రానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం సేవలు అందించడంతో నెలకు రూ.20 వేల వరకు వచ్చేది. ఈ అయిదేళ్లలో మీసేవ కేంద్రాలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. కేంద్రాన్ని మూసేయాల్సివచ్చింది.

జిల్లాలోని మీ సేవ కేంద్రం నిర్వాహకుడి ఆవేదన ఇది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని