logo

వేణుగోపాలా.. ఇదేం మాయ?

సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు అధికారపక్షం ఎంతకైనా తెగిస్తోంది. ప్రభుత్వం తీరును ఎన్నికల సంఘం తప్పుపడుతున్నా.. అధికార పక్షానికి అంటకాగుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడంలేదు.

Published : 28 Apr 2024 04:06 IST

ఈయనే జడ్పీ ఛైర్మన్‌.. వైకాపా అభ్యర్థి
సీఈవోలే ఆ నియోజకవర్గ ఈఆర్వోలు.. ఆర్వోలు

ఈనాడు, కాకినాడ: సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు అధికారపక్షం ఎంతకైనా తెగిస్తోంది. ప్రభుత్వం తీరును ఎన్నికల సంఘం తప్పుపడుతున్నా.. అధికార పక్షానికి అంటకాగుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడంలేదు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి దర్శనమిస్తోంది. పి.గన్నవరం మండలం నుంచి జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా విప్పర్తి వేణుగోపాలరావు వ్యవహరిస్తున్నారు. వైకాపా అధిష్ఠానం పి.గన్నవరం నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును పక్కనపెట్టి.. వేణుగోపాలరావును అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది. జడ్పీ ఛైర్మన్‌ కనుసన్నల్లో పనిచేసే సీఈవోనే ఈ నియోజకవర్గ ఓట్ల నమోదు అధికారిగా, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా ఆయన నియమించుకోవడం గమనార్హం. జడ్పీ సీఈవోగా 2020 అక్టోబô్ 29 నుంచి 2023 జూన్‌ 14 వరకు డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో ఎన్‌.వి.వి.సత్యనారాయణ పనిచేశారు. 2023 జూన్‌ 15 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు డిప్యూటీ సీఈవో ఎ.రమణారెడ్డి ఇన్‌ఛార్జి సీఈవోగా వ్యవహరించారు. ప్రస్తుతం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎ.శ్రీరామచంద్రమూర్తి సీఈవోగా ఉన్నారు.

ఒకరి తర్వాత ఒకరుగా..

ఎన్నికల సన్నద్ధత క్రమంలో ఓటర్ల నమోదు అధికారిగా సీఈవో సత్యనారాయణ కొద్దికాలం పి.గన్నవరం బాధ్యతలు చేపట్టారు. ఆయన బదిలీ తర్వాత రమణారెడ్డి ఇక్కడ ఈఆర్వోగా వ్యవహరించి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ- 2024 క్రతువు పూర్తిచేశారు. ఎన్నికల బదిలీల్లో కొత్తగా జిల్లాకు వచ్చిన సీఈవో శ్రీరామచంద్రమూర్తికి సైతం ఇక్కడే ఆర్‌వో బాధ్యతలు అప్పగించారు.. ఇలా ఉద్దేశపూర్వకంగా సొంత నియోజకవర్గం ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారనే విమర్శలున్నాయి. తనను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పించి వేరొక నియోజకవర్గం అప్పగించాలని ఆ మధ్య ఆయన లిఖితపూర్వకంగా కోరారు. అధికారపక్షం రాజకీయం వల్ల ఆయనే ఆర్వోగా కొనసాగాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని