logo

రావి వెంకటరమణపై వేటు

పొన్నూరు నియోజకవర్గ వైకాపా మాజీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్‌ చేస్తున్నట్లు బుధవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

Published : 13 Oct 2022 05:21 IST

వైకాపా నుంచి సస్పెండ్‌ చేసిన అధిష్ఠానం


మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, పొన్నూరు: పొన్నూరు నియోజకవర్గ వైకాపా మాజీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్‌ చేస్తున్నట్లు బుధవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. రావి వెంకటరమణ కాంగ్రెస్‌ పార్టీలో అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రత్తిపాడు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు కావడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైకాపాలో చేరి అప్పటి నుంచి కొనసాగారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి 2014లో వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా కొనసాగారు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పని చేసి పార్టీ అభివృద్ధికి కృషిచేశారు. 2019 ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణల్లో భాగంగా ఆఖరులో రావి వెంకటరమణ స్థానంలో కిలారి వెంకట రోశయ్యకు సీటు ఇచ్చారు. ఎన్నికల్లో రోశయ్య గెలుపొంది ఎమ్మెల్మే అయ్యారు. రావి వెంకటరమణకు ఎమ్మెల్సీ ఇస్తారని పలుమార్లు ప్రచారం జరిగినా పదవి దక్కలేదు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా ఎమ్మెల్యే, రావి వెంకటరమణ వర్గీయుల నడుమ అంతర్గత పోరు నడుస్తోంది. రెండు వర్గాల నడుమ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పెదకాకాని వైకాపా మండల అధ్యక్షుడు గొట్టిముక్కల పూర్ణచంద్రరావుపై సోమవారం రాత్రి గుంటూరులోని అమరావతి రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడికి నిరసనగా వైకాపాలోని రావి వెంకటరమణ వర్గం పొన్నూరులో ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంగళవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి స్థానిక ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. గొట్టిముక్కల పూర్ణచంద్రరావుపై దాడితో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రకటించారు. ఇలా ఇరువర్గాల నడుమ పోరు నడుస్తోంది. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణపై క్రమశిక్షణ చర్యలు చేపట్టడం ఆయన వర్గీయులతో పాటు వైకాపాలోనూ కలకలం రేపింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అనుచరుడిగా ఆయన మరణానంతరం కుటుంబానికి విధేయుడిగా ఉన్న రావి వెంకటరమణపై వేటు వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వైకాపా స్థాపించినప్పటి నుంచి ఆయన వెన్నంటి ఉంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న విషయాన్ని ఆయన వర్గీయులు గుర్తు చేస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న రావి వెంకటరమణను పార్టీ నుంచి తొలగించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలపై చర్చలు మొదలయ్యాయి. రావి వెంకటరమణ ఎటువైపు వెళతారు? ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని