logo

అందరి చూపు.. కంప్యూటర్‌ సైన్స్‌వైపే..

ఇంజినీరింగ్‌ కళాశాలలో సీట్ల ఎంపిక 7 నుంచి ప్రారంభం కానుండగా విద్యార్థి తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు.

Published : 04 Aug 2023 06:50 IST

7 నుంచి ఇంజినీరింగ్‌ సీట్లకు వెబ్‌ ఆప్షన్లు

చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ కళాశాలలో సీట్ల ఎంపిక 7 నుంచి ప్రారంభం కానుండగా విద్యార్థి తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. మెజారిటీ విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. తమకు సమీపంలో నాలుగైదు కళాశాలలను ఇప్పటికే చూసుకొని, వాటిలో ఈ కోర్సులో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇంజినీరింగ్‌ సీట్లకు సంబంధించి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా దాన్ని సాంకేతిక విద్యాశాఖ మార్పు చేసింది... మారిన షెడ్యూల్‌ ప్రకారం ఈ ప్రక్రియ 7 నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.. ఒక్కొక్క విద్యార్థి సరాసరి వంద వరకు ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది... వీటిని ఈ నెల 13న మార్పు చేసుకునే వెసులుబాటు కల్పించింది... 17న సీట్ల కేటాయింపు జాబితాను ప్రకటించనుంది... ఆ తరువాత తమకు సీటు వచ్చిన వారు 21వ తేదీ నాటికి కళాశాలల్లో  చేరాలని పేర్కొంది... ఈ సమయంలో విద్యార్థులు తొందరపడకుండా జాగ్రత్తగా కళాశాలలు ఎంపిక చేసుకోవాల్సి ఉందని నిపుణులు అంటున్నారు.
ఏపీ ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్లను సాంకేతిక విద్యాశాఖ కేటాయిస్తోంది. ఇప్పటికే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తమ పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో మౌలిక వసతులు, ప్రాంగణ ఎంపికల తీరు, విద్యా బోధన, ఉత్తీర్ణత శాతం తదితర విషయాలపై ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం చాలా మంది కంప్యూటర్‌ సైన్సు ఇంజినీరింగ్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలి విడతలో దీనిపైనే మొగ్గు చూపుతున్నారు. దీనికోసం వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ 12 తేదీ వరకు ఉంది. రాష్ట్రంలో ఉన్న ఏ కళాశాలలోనైనా లోకల్‌, నాన్‌లోకల్‌ కింద ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఇంజినీరింగ్‌ కళాశాలలుండగా వీటిల్లో 3500 వరకు వివిధ బ్రాంచీల్లో సీట్లు లభ్యం కానున్నాయి. ఎక్కువ మంది ఇతర ప్రాంతాల్లో ఉన్న కళాశాలలపై మక్కువ చూపడంతో స్థానికంగా ఉన్నవాటిల్లో సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ప్రస్తుతం కరోనా తరువాత ఆ పరిస్థితి చాలా వరకు తగ్గింది. అధిక శాతం మంది స్థానిక కళాశాలల్లోనే చదివేందుకు ఆసక్తి కనబరచడంతో సీట్లు చాలా వరకు భర్తీ అవుతున్నాయని ఆయా కళాశాలల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఆప్షన్లు ఇచ్చే సమయంలో ఏ కళాశాలలో ఏ ర్యాంకుకు గత ఏడాది సీటు వచ్చిందో గూగుల్‌లో పరిశీలించుకోవడం మంచిదని, ఇదే సమయంలో వాటికి ఏ రకమైన గుర్తింపు ఉన్నదో తెలుసుకోవడంతో పాటు పూర్వ విద్యార్థుల నుంచి సలహాలు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచి చదివినా సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడిన వారు చాలా మంది ఉన్నారని చెబుతున్నారు. కళాశాలలో చేరిన రోజు నుంచే ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటే ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశం ఉందని, దీంతో పాటు సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో రాణించేందుకు వీలుకలుగుతోందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని