logo

వామ్మో.. ఒత్తిడి భరించలేకున్నాం

పాఠశాల విద్యాశాఖ పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయవర్గానికి నానాటికీ మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. హాజరు నమోదు నుంచి వర్క్‌బుక్‌ కరెక్షన్‌ వరకు ప్రతి లోపానికి వారినే బాధ్యుల్ని చేసి సంజాయిషీలు కోరడంతో బెంబేలెత్తుతున్నారు.

Updated : 08 Aug 2023 06:43 IST

ఆందోళనలో ఉపాధ్యాయ వర్గం
వీఆర్‌ఎస్‌.. మెడికల్‌ లీవ్‌లకు దరఖాస్తులు
ఈనాడు, బాపట్ల

పాఠశాల విద్యాశాఖ పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయవర్గానికి నానాటికీ మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. హాజరు నమోదు నుంచి వర్క్‌బుక్‌ కరెక్షన్‌ వరకు ప్రతి లోపానికి వారినే బాధ్యుల్ని చేసి సంజాయిషీలు కోరడంతో బెంబేలెత్తుతున్నారు. ఇలాగైతే ఉద్యోగం ఏం చేస్తామని చెప్పి ఆందోళన, ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కారణాలేమైనా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇటీవల నలుగురు ఉపాధ్యాయులు మృత్యువాత పడటం సహచర ఉపాధ్యాయవర్గాన్ని కలవరపరుస్తోంది. ఆ మరణాలు చూశాక కొందరు విధి నిర్వహణలో ఒత్తిడికి గురైతే మన పరిస్థితి అంతే అవుతుందేమోనని భయపడి ఏకంగా మెడికల్‌ లీవ్‌, స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) బాట పడుతున్నారు. బతికి ఉంటే బలుసాకు తినయినా బతకొచ్చని నిరంతరం ఆ ఒత్తిడి ఎక్కడ పడతామని మరికొందరు అంటున్నారు.. వీటిని బట్టి చూస్తుంటే ఉపాధ్యాయవర్గం ఎంత ప్రతికూల వాతావరణంలో పని చేస్తుందో అర్థమవుతోంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో పలువురు హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారని విద్యాశాఖవర్గాలు పేర్కొన్నాయి.

పిల్లోడు బడికి రాకపోయినా.. హోంవర్క్‌ చేయకపోయినా వారిని పన్నెత్తి మాట అనకూడదు. కానీ వాటికి ఉపాధ్యాయుల్ని బాధ్యులుగా చేయటం ఉన్నతాధికారుల తీరు కాబోతుంది. ఒకవైపు పిల్లల్ని ఏమీ అనొద్దని చెబుతున్నారు. అలాంటప్పుడు పిల్లలకు తామంటే ఏం భయం ఉంటుంది? మందలించో, బెత్తంతో ఒక దెబ్బేస్తేనో పిల్లోడు కాస్తోకూస్తో క్రమశిక్షణ కలిగి ఉంటాడు. ఇవేం లేకుండా పిల్లోడిలో మార్పు తీసుకురావడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ప్రతి దానికి ఉపాధ్యాయడ్నే బాధ్యున్ని చేసి శిక్షించాలనుకోవటం సరికాదని ఉన్నతాధికారులు తమ పంథా మార్చుకోవాలని సూచిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. ఆ పరిస్థితి రాక మునుపే ఉన్నతాధికారులు అప్రమత్తమై ఉపాధ్యాయ వర్గంలో స్నేహపూర్వక వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ముందస్తు  అనుమతి పొందినా..

పదవీ విరమణకు నాలుగేళ్ల సర్వీసు ఉన్న ప్రధానోపాధ్యాయుడొకరు ఇటీవల అత్యవసరంగా ఒక రోజు సెలవు పెట్టారు. ఆరోజు స్కూల్‌ పర్యవేక్షణ ఎవరు చూడాలో పక్కాగా ఇంఛార్జి బాధ్యతలు అక్కడ ఉన్న సీనియర్‌ ఉపాధ్యాయుడికి అప్పగించారు. ఆపై తాను సెలవు పెట్టే విషయాన్ని డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారికి తెలియజేసి ఆయన అనుమతి  పొందారు. సెలవు వివరాలు యాప్‌లో అప్లోడ్‌ చేయడానికి ప్రయత్నిస్తే అది పని చేయలేదని మిన్నకుండిపోయారు. సెలవు పెట్టిన విషయం యాప్‌లో అప్లోడ్‌ చేయలేదని డీఈవో సంజాయిషీ కోరారు. ఇలాంటి సంజాయిషీ నోటీసులు ఇటీవల ఒక్క పల్నాడు జిల్లాలోనే వంద మందికి పైగా టీచర్లు అందుకున్నారు. ప్రతి ఉపాధ్యాయుడికి ఏడాదికి కొన్ని సెలవులు ఉంటాయి. కనీసం ఆ సెలవును కూడా వినియోగించుకోకుండా ఉద్దేశపూర్వకంగా ఉన్నతాధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. తాను సెలవు పెడితే ఎవరు స్కూల్‌ బాధ్యతలు చూస్తారో కూడా ముందుగానే ఏర్పాట్లు చేశానని, అయినా తనకు సంజాయిషీ నోటీసు పంపడంతో ఆ హెచ్‌ఎం మనస్తాపం చెంది వీఆర్‌ఎస్‌ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.


వీఆర్‌ఎస్‌కు మొగ్గుచూపినవారిలో కొందరు..

  • మాచవరంలో పనిచేసే ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం ఒకరు వీఆర్‌ఎస్‌ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
  • తాను పనిచేసే పాఠశాలలో విపరీతమైన ఒత్తిడి ఉంటోందని స్కూల్‌ అసిస్టెంట్‌ ఒకరు రెండేళ్ల క్రితం వీఆర్‌ఎస్‌కు పెట్టుకున్నారు. ఆమె ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. ఒత్తిడి కారణంగా రెండేళ్ల ముందే తాను వీఆర్‌ఎస్‌ తీసుకోవడంతో ఆర్థికంగా నష్టపోయినా ఆరోగ్యంగా మిగిలి ఉండటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఇటీవల వీడ్కోలు సభలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
  • గుంటూరులో ఓ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హెచ్‌ఎం ఒకరు నాడు-నేడు పనుల నిర్వహణకు సకాలంలో నిధులు రాకపోవడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. దానికి తనను బాధ్యుల్ని చేస్తూ ఉన్నతాధికారులు పదేపదే హెచ్చరిస్తుండటంతో సదరు హెచ్‌ఎం ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేయలేనని స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.
  • సత్తెనపల్లి డివిజన్‌కు చెందిన ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం ఒకరు తను పని చేసే పాఠశాలలో నాడు - నేడు పనులకు నిధులు, మెటీరియల్‌ ఇవ్వకుండా పనులు వేగవంతం చేయాలని ఒత్తిడి పెట్ట డంతో ఆమె వీఆర్‌ఎస్‌కు పెట్టుకొని ఇటీవలే విరమణ పొందారు.

  • గురజాల డివిజన్‌కు చెందిన ప్రధానోపాధ్యాయుడొకరికి తన స్కూల్‌తో పాటు మరో స్కూల్‌కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఏకకాలంలో ఆ రెండు పాఠశాలల బాధ్యతలు చూడలేక ఇబ్బంది పడుతున్నారు. ఓ స్కూల్‌ బాధ్యతలు తప్పించాలని హెచ్‌ఎంగా తనకు పెద్దగా అనుభవం కూడా లేదని విన్నవించుకుంటే తన మొర ఆలకించకపోగా, ఆ రెండు స్కూళ్లల్లో ఏ లోపం ఉన్నా తననే బాధ్యుడ్ని చేస్తున్నారని మెడికల్‌ లీవులోకి వెళ్లిపోయారు.

సగం మంది వెళ్లిపోతారు

స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నా వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల్ని మాత్రం వాస్తవంగా వారు ఎప్పుడైతే రిటైర్డు అవుతారో అప్పుడే ఇస్తామని ఆ మధ్య ప్రభుత్వం ఓ నోట్‌ పంపింది. ఈ నిబంధన లేకుంటే వెంటనే తమకు రావాల్సిన ప్రయోజనాల్ని ఇచ్చేస్తామంటే సగం మంది ఉద్యోగాలకు ముందుగానే విరమణ చేసి వెళ్లిపోతారని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. గతంలో ఎప్పుడూ టీచర్లకు ఇంతగా ఒత్తిడి లేదని గుర్తు చేశారు. హాజరు నమోదుకు సర్వర్‌ సామర్థ్యం పెంచకుండా సకాలంలో హాజరు వేసుకోలేదని తమను ఇబ్బంది పెట్టడం విడ్డూరంగా ఉందని వెంటనే ప్రభుత్వం ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని, చీటిమాటికి టీచర్లను బాధ్యుల్ని చేసే విధానాల్ని ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని