logo

గర్జించిన గుంటూరు.. చంద్రబాబుకు అభిమాన నీరాజనం

‘గుంటూరు మిరప ఘాటు ఎలా ఉంటుందో సత్తా చూపారు. ర్యాలీ అదుర్స్‌’ అని రోడ్‌షోలో భారీగా స్వాగతం పలికిన, సభకు హాజరైన జనాన్ని చూసి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఇలా స్పందించారు.

Updated : 02 May 2024 07:04 IST

అభివృద్ధి బాధ్యత మేం తీసుకుంటాం
పేదలకు పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తాం
ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, పట్టాభిపురం, పెదకాకాని

‘గుంటూరు మిరప ఘాటు ఎలా ఉంటుందో సత్తా చూపారు. ర్యాలీ అదుర్స్‌’ అని రోడ్‌షోలో భారీగా స్వాగతం పలికిన, సభకు హాజరైన జనాన్ని చూసి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఇలా స్పందించారు. బుధవారం గుంటూరు హిమని సెంటర్‌లో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గుంటూరు ప్రజల జోష్‌ చూస్తుంటే వైకాపాకు డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు. నగరంలో పేదలకు పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ‘ఇక్కడి రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. వైకాపా పాలనలో వాటిని భ్రష్టు పట్టించారు. గ్రామాల్లోనూ రహదారులు పాడైపోయాయి. మేం వచ్చాక వాటిని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తాం. పెమ్మసాని చంద్రశేఖర్‌ లాంటి వాళ్లు అమెరికా వెళ్లి వ్యాపారాలు చేసి వచ్చారు. విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే సంస్థలు ఏర్పాటు చేసుకునేలా సహకారం అందిస్తామన్నారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు, గొడ్డలితో బాబాయ్‌ను చంపి వేరేవాళ్లపైకి నెట్టడం వంటి డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే వైకాపా నుంచి విముక్తి కల్పించాలని’ పిలుపునిచ్చారు.

ఐటీ టవర్స్‌ కట్టిస్తాం.. ‘గుంటూరులో ఐటీ టవర్స్‌ కట్టించి ఉపాధి కల్పిస్తాం. ముస్లింలకు అన్ని విధాలా అండగా ఉంటాం. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు సూపర్‌-6 పథకాలు తీసుకొచ్చాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మీరే నా సైన్యం. ఓటింగ్‌కు ఎండ ఉందని వెళ్లకుండా ఉండొద్దు. అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని’ కోరారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు తూర్పు అభ్యర్థి మహమ్మద్‌ నసీర్‌, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవిని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే ముస్తఫా గుట్కా వ్యాపారి..

‘ఎమ్మెల్యే ముస్తఫా భూకబ్జాలు చేశారు. ఆయన కుటుంబం గుంటూరులో గుట్కా వ్యాపారం చేస్తోంది. నగరంలో గంజాయి సరఫరా చేస్తున్నారు. సిగరెట్‌ల తయారీలో కూడా గంజాయి కలిపేస్తున్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తుల్ని కబ్జా చేశారు. ముస్లిం కళాశాల వద్ద ఖాళీ స్థలాలు కబ్జా చేశారు. ఆటోనగర్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వద్ద 32 ఎకరాలు ఆక్రమించారు. ఇంటి పని మనిషి కొడుకు తెదేపాలో తిరిగాడని దొంగతనం కేసు పెట్టించి చిత్రహింసలకు గురిచేశారు. ఒకరోజు వస్తుంది. దీనికంతటికీ పరిష్కారం జరిగే రోజు వస్తుంది. వక్ఫ్‌బోర్డు ఆస్తులు కబ్జా చేసిన వారి మక్కెలు విరగ్గొట్టి వెనక్కి తీసుకుంటామని’ హామీ ఇచ్చారు.

మార్ఫింగ్‌ చేసి తప్పుడు ప్రచారం.. ‘కంప్యూటర్‌లో మనుషులనే మార్చేస్తున్నారు. నా పేరుతో తప్పుడు వార్తలు పెడుతున్నారు. నేను అనని వాటిని కూడా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. నేను సంతకం పెట్టకపోయినా తప్పుడు సమాచారం విడుదల చేస్తున్నారు. ఇలా మార్ఫింగులు చేసేవారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూమి పత్రాలు మార్ఫింగ్‌ చేస్తే మీరేమవుతారు. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ రావడానికి వీలులేదు. వైకాపా కార్యకర్తలు మన జీవితాలు తారుమారు చేస్తారని’ పేర్కొన్నారు. తెదేపా నేతలు తెనాలి శ్రావణ్‌కుమార్‌, బూర్ల రామాంజనేయులు, మన్నవ సుబ్బారావు, మన్నవ మోహనకృష్ణ, కనపర్తి శ్రీనివాసరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు, మద్దిరాల మ్యానీ, సుఖవాసి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


తెదేపాలోకి డిప్యూటీ మేయర్‌.. గుంటూరు నగర డిప్యూటీ మేయర్‌ సజీల, ఆమె తండ్రి షేక్‌ షౌకత్‌ చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. వైకాపాలో విసిగిపోయి తెదేపాలో చేరుతున్నారని, ఒక మహిళ, ఉత్సాహవంతురాలు అయిన ఆమెను తప్పకుండా ఆదరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.


బాబుకు అపూర్వ స్వాగతం

మ అభిమాన నేత చంద్రబాబును కళ్లారా చూసేందుకు జనం తరలివచ్చారు. మహిళలు పలుచోట్ల హారతులు పట్టారు. పిల్లలు రోడ్‌షోలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువకులు బైక్‌లపై విన్యాసాలు చేస్తే.. యువతులు నృత్యాలు చేశారు. నగరంలోని పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్‌షో సూపర్‌ హిట్ కాగా, ప్రజాగళం సభ బంపర్‌ సక్సెస్‌ అయింది. చంద్రబాబుకు జనం నీరాజనం పట్టారు. ఆయన వాహనాన్ని ముందుకు కదలనివ్వకుండా పూలు చల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన రోడ్‌ షో రెండు గంటలకు పైగా ఆలస్యమైనా చంద్రబాబు వచ్చే వరకూ ఆతృతగా ఎదురు చూశారు.


జన ప్రభంజనంతో నగరం దద్దరిల్లింది

- పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు ఎంపీ అభ్యర్థి

రోడ్‌షో, ప్రజాగళం సభకు తరలివచ్చిన జన ప్రభంజనానికి గుంటూరు దద్దరిల్లిపోయింది. ఇంత పెద్దఎత్తున జనం తరలివస్తారని మేము ఊహించలేదు. తెలుగుజాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా వ్యాపింప చేసిన చంద్రబాబుకు జన నీరాజనం పట్టారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు జగన్‌ అధికారాన్ని వాడారు. చంద్రబాబు అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిని చేస్తే...జగన్‌ అబ్దుల్‌ సలాంను ఆత్మహత్య చేసుకునే విధంగా వేధించారు. మన సంపదను వేరే రాష్ట్రాలకు, దేశాలకు పంచిపెట్టారు. చంద్రబాబు యూనివర్సిటీలు తీసుకొస్తే జగన్‌ గంజాయిని తీసుకొచ్చారు. 2019లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లయితే ప్రపంచ స్థాయి భవనాలు నిర్మించేవారు. ప్రస్తుతం చదువుకున్న వాళ్లకు ఉద్యోగాల్లేవు. రోడ్లు లేవు. చివరకు మంచినీళ్లు కూడా లేవు.


జగన్‌ పాలనలో అయిదేళ్లుగా అశాంతే..

- గళ్లా మాధవి, గుంటూరు పశ్చిమ అభ్యర్థి

యిదేళ్లుగా జగన్‌, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వైఖరితో  అశాంతి నెలకొంది. ఆంధ్ర రాష్ట్రమా ఇక ఊపిరి పీల్చుకో. ఎలుగెత్తి గర్జించు. ఎందుకంటే బాహుబలి లాంటి చంద్రన్న అధికారంలోకి వస్తున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించండి.


పథకాలన్నీ జగన్‌ రద్దు చేశారు

- మహమ్మద్‌ నసీర్‌, గుంటూరు తూర్పు అభ్యర్థి

న్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ముస్లింలపై ఎక్కడా దాడులు జరగలేదు. ముస్లింల సంక్షేమానికి ఎన్నో పథకాలు రూపొందించారు. ఎంతో మంది ముస్లింలకు రంజాన్‌ తోఫా, దుల్హన్‌, విదేశీ విద్య పథకాలు అందజేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆ పథకాలన్నీ రద్దు చేశారు. చంద్రబాబు ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. నిండు మనసుతో ఆశీర్వదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని