logo

Tomato: అప్పుడు రూ.10... ఇప్పుడు రూ. 100.. ఎందుకిలా?

టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏప్రిల్‌లో కిలో రూ. 10కి దొరికిన టమాట నేడు రూ.100కు తగ్గడంలేదు. కొన్నేళ్లుగా పరిశీలిస్తే.. ఎప్పుడెప్పుడు ధర పతనమౌతోంది..

Updated : 10 Jul 2023 08:46 IST

92.6 శాతం ఇతర రాష్ట్రాల నుంచే రాక
మున్ముందు కొరతను అధిగమించేందుకు ప్రణాళికలు

ఈనాడు - హైదరాబాద్‌:టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏప్రిల్‌లో కిలో రూ. 10కి దొరికిన టమాట నేడు రూ.100కు తగ్గడంలేదు. కొన్నేళ్లుగా పరిశీలిస్తే.. ఎప్పుడెప్పుడు ధర పతనమౌతోంది.. ఆకాశాన్ని అంటుతోంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఏ కాలంలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పుష్కలంగా పండే టమాట పంటను తెలంగాణ రైతులు సొమ్ము చేసుకోలేకపోతున్నారు. నగరానికి నిత్యం 5 వేల నుంచి 6 వేల క్వింటాళ్ల టమాటా అవసరం కాగా.. ఇందులో తెలంగాణలో పండిన 65 శాతం పంట జనవరిలో మార్కెట్‌కు వచ్చేది. అలాగే ఫిబ్రవరి వచ్చే సరికి 60 శాతం, మార్చి నాటికి 45 శాతం, ఏప్రిల్‌లో 40 శాతం, మే నెలలో 35 శాతం, జూన్‌ వచ్చే సరికి 20 శాతం, జులైకి 7.4 శాతం.. ఇలా తెలంగాణలో టమాట పంట పడిపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

20 రోజుల్లో అదుపులోకి..

నగరానికి అనంతపురం, మదనపల్లి, మహారాష్ట్రలోని షోలాపూర్‌, లాథోర్‌, కర్ణాటకలోని శ్రీనివాసపురం నుంచి మాత్రమే టమాట పంట వస్తోంది. ఆదివారం 1,520 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. నగరానికి అవసరమైన దాంట్లో నాలుగోవంతు మాత్రమే రావడంతో ధర రూ.వందకు దిగి రావడంలేదు. బయట రాష్ట్రాల నుంచి 92.6 శాతం వస్తోంది. మరో 20 రోజులూ పరిస్థితి ఇలాగే ఉంటుందని,  తర్వాత రూ.50కి కిలో దొరికే అవకాశాలున్నాయని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. అక్టోబరు నాటికి తెలంగాణ టమాట అందుబాటులోకి వస్తే కిలో రూ. 20లోపే దొరికే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండుమూడేళ్లుగా ధరల్లో వ్యత్యాసం.. పంట దిగుబడి.. తదితర వివరాలన్నీ అధ్యయనం చేసి.. వచ్చే ఏడాది ఇలాంటి పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యానశాఖ నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని